TGPSC Group 1 Mains: ప్రశాంతంగా ప్రారంభమైన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు.. సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

|

Oct 21, 2024 | 2:49 PM

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ఎట్టకేలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వివాదాలు, నిరసనల నడుమ టీజీపీఎస్సీ.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పటిష్ట బందోబస్తుతో పరీక్షలను ప్రారంభించింది. మొత్తం 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు..

TGPSC Group 1 Mains: ప్రశాంతంగా ప్రారంభమైన టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు.. సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు
TGPSC Group 1 Mains
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వివాదాల నుడుమ ఎట్టకేలకు గ్రూప్‌ 1 పరీక్షలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.30 నుంచి అభ్యర్థుల్ని ఆయా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గేట్లు మూసేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. తొలి రోజు మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అక్టోబరు 21 నుంచి 27 వరకు టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు హైదరాబాద్‌ నగర పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పరీక్ష కేంద్రం వద్ద ఎస్సైల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఉంచారు. అదనంగా పోలీస్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం కూడా పరీక్ష కేంద్రాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. పర్యవేక్షణకు 3 కమిషనరేట్లలో ఒక్కో డీసీపీని నోడల్‌ అధికారిగా నియమించారు.

హైదరాబాద్‌ నగర పరిధిలో ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు తరలించే వాహనాలకు టీజీపీఎస్సీ తొలిసారిగా జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఉపయోగిస్తుంది. టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకునే వారకు వీటిని పర్యవేక్షిస్తారు. ఈ మేరకు పటిష్ట భద్రత నడుమ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలా తొలిరోజు ప్రశాంతంగా పరీక్షలను ప్రారంభించారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ మొత్తం 7 పేపర్లకు జరుగుతాయి. నేడు తొలి పరీక్ష జరుగుతుంది. ఇంకా మిగిలిన ఆరు పేపర్లకు రేపట్నుంచి ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

గత కొంత కాలంగా గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక గ్రూప్‌ 1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో కూడా నిరాశే ఎదురైంది. పరీక్షకు అంతా సిద్ధమైన సమయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పరీక్ష వాయిదా వేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది కాబట్టి.. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందన్న సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టులోనే విచారణ జరపాలని ఆదేశించింది. ఫలితాల వెల్లడికి ముందే తుది తీర్పు ఇవ్వాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

గ్రూప్‌ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో.. భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ అన్నారు. కాగా మొత్తం 563 గ్రూప్‌ 1 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.