TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఉచితంగా DSC 2024కి దరఖాస్తుల స్వీకరణ

|

Jun 12, 2024 | 1:23 PM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు బుధవారం (జూన్‌ 12న) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు..

TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఉచితంగా DSC 2024కి దరఖాస్తుల స్వీకరణ
TG TET 2024 Results
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 12: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు బుధవారం (జూన్‌ 12న) విడుదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా బుధవారం మధ్యాహ్నం టెట్-2024 ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. తెలంగాణ టెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో ఉత్తీర్ణత శాతం 67.13%గా నమోదుకాగా.. పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18% మాత్రమే ఉన్నారు.

తెలంగాణ టెట్ 2024 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • టెట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి
  • హోమ్ పేజీలో TG TET 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి
  • అనంతరం అభ్యర్థుల లాగిన్ వివరాల నమోదుకు కొత్త లింక్‌ ఓపెన్‌ అవుతుంది
  • తర్వాత సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. వెంటనే స్క్రీన్‌పై రిజల్ట్స్‌ కనిపిస్తాయి
  • భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్స్‌ డౌన్‌లోడ్ చేసుకుని హార్డ్ కాపీని భద్రపరచుకోవాలి

తెలంగాణ టెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో కూడా 18.88% పెరిగిన అర్హత శాతం. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించినట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అలాగే టెట్-2024లో కొత్తగా అర్హత సాధించిన వారికి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు రేవంత్‌ వెల్లడించారు.

కాగా మొత్తం 11,062 టీచర్ పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. టెట్‌ ఫలితాల నేపథ్యంలో ఆన్‌లైన్‌ దరఖాస్తుల తుది గడువును జూన్ 20వ తేదీ వరకు పొడిగించింది. తాజా ఫలితాల్లో కొత్తగా అర్హత సాధించిన వారు మరో వారం పాటు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో జరగనున్నాయి.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.