
హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆలస్య రుసుములేకుండా ఏప్రిల్ 4తో ముగియనున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఈఏపీసెట్ దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 28 నాటికి ఇంజినీరింగ్‌కు 1,78,442 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 73,782 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 4తో ముగుస్తుంది. అంటే మరో 6 రోజులే సమయం ఉంది. ఆ తర్వాత ఆలస్య రుసుంతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆ సంఖ్య 6 వేలకు మించదని తెలుస్తుంది. గత ఏడాది ఇంజినీరింగ్ విభాగానికి ఏకంగా 2.20 లక్షల దరఖాస్తులు అందాయి. ఇక అగ్రికల్చర్‌కు దాదాపు 87 వేలు వస్తాయి. మొత్తం కలిపి 3.07 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఇంజినీరింగ్‌కు 2 లక్షలు, అగ్రికల్చర్‌కు 80 వేల మంది లోపే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో దాదాపు 30 వేల వరకు దరఖాస్తులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె విజయకుమార్‌రెడ్డి తెలిపారు.
గత ఏడాది ఏపీ విద్యార్ధులు భారీగా దరఖాస్తు చేసుకోవడం వల్ల దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఇక ఆ మరుసటి రోజు నుంచే అంటే మే 12 నుంచి ఏపీ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మొదలవుతాయి. దీంతో ఈసారి ఏపీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత ఏడాది ఇంజినీరింగ్‌కు 17,834 మంది, అగ్రికల్చర్‌కు 2,877 మంది ఇతర రాష్ట్రాల విద్యార్ధులు దరఖాస్తు చేశారు. ఈసారి ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కు 8 వేలు, అగ్రికల్చర్‌కు 1400 మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.