PM Internship Scheme 2025: నిరుద్యోగ యువతకు లక్షకుపైగా PM ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. ఎవరు అర్హులంటే?

|

Feb 20, 2025 | 7:12 AM

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 కింద ఈ ఏడాదికి దేశ యువతకు దాదాపు లక్ష ఇంటర్న్‌షిప్‌లు అందించనుంది. దేశంలోని టాప్ 500 కంపెనీలతో ఏడాది పాటు ఈ ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది. ఇలా మొత్తం ఐదేళ్లలో పది లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది..

PM Internship Scheme 2025: నిరుద్యోగ యువతకు లక్షకుపైగా PM ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. ఎవరు అర్హులంటే?
PM Internship Scheme 2025
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 కింద దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది.  ఇందుకు సంబంధించి ఈ ఏడాదికి ఇప్పటికే పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాల కోసం యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాదికి లక్షకుపైగా ఇంటర్న్‌షిప్ లను అందించనుంది. మార్చి 12, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తొలుత తమ పేర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని, ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.

ఎవరు అర్హులంటే?

నిబంధనల ప్రకారం 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దూరవిద్యతో పాటు పదో తరగతి పాసైన అభ్యర్థులతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం రూ. 8 లక్షలు దాటిన కుటుంబాలకు చెందినవారితో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన ఈ ఇంటర్న్‌షిప్‌కు అనర్హులు.

ఇవి కూడా చదవండి

రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థులకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 వరకు స్టైపెండ్‌గా చెల్లిస్తారన్నమాట. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇందులో కనీసం 6 నెలలు తరగతి గదిలో, మరో 6 నెలలు ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంటుంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఆసక్తి కలిగిన వారు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 లింక్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.