
హైదరాబాద్, ఆగస్టు 5: నేటి నుంచి నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. NEET UG 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ESIC, AFMS, AIIMS, JIPMER తదితర సంస్థల్లో ప్రవేశాల కోసం MCC నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన అన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని MCC సూచించింది. రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ వంటి ప్రక్రియలు MCC కౌన్సెలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. స్కోర్‌కార్డు, అప్లికేషన్ వివరాలు, పరీక్షకు సంబంధించిన సమాచారం NEET అధికారిక పోర్టల్‌లో పొందవచ్చు. 85 శాతం రాష్ట్ర కోటా అభ్యర్థులకు ప్రత్యేక నమోదు. 85% రాష్ట్ర కోటా కింద మెడికల్ సీట్లు కోరుకునే అభ్యర్థులు ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ వెబ్‌సైట్లలో విడిగా నమోదు చేసుకోవాలి. రాష్ట్ర కౌన్సెలింగ్‌ను MCC నిర్వహించదు.
ఈసారి MCC పలు సాంకేతిక మార్పులను తీసుకొచ్చింది. అభ్యర్థులు కాలేజీలకు పదేపదే వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. వన్-టైమ్ ఫిజికల్ రిపోర్టింగ్ విధానం అమల్లోకి వచ్చింది. Freeze ఎంపిక చేసిన అభ్యర్థులు కేటాయించిన కాలేజీలో చేరి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. Float ఎంపిక చేసిన వారు తదుపరి రౌండ్లలో పాల్గొనవచ్చు. అవసరమైన పత్రాల ధృవీకరణ ఆన్‌లైన్‌లో పూర్తవుతుంది. మూడో రౌండ్ తర్వాత కూడా అదే సీటు కొనసాగితే మాత్రమే కాలేజీకి ప్రత్యక్షంగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఆన్‌లైన్ రాజీనామా (Online Resignation) సౌకర్యం కల్పించారు. అర్హత ఉన్న అభ్యర్థులు కాలేజీకి వెళ్లకుండా కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారానే సీటును వదులుకోవచ్చు. ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, NRI అడ్మిషన్ల డిజిటలైజేషన్, PwBD అభ్యర్థులకు మెరుగైన సౌకర్యాలు, సైబర్ భద్రత బలోపేతం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరింత సమర్థవంతం చేసింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి, తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసి నిర్ణీత గడువులోపు లాక్ చేయాలి. అనంతరం NEET UG 2026 ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ, అభ్యర్థి ఇచ్చిన ప్రాధాన్యతలు, సీట్ల లభ్యత ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
రిజిస్ట్రేషన్‌కు ముందు అభ్యర్థులు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.