
హైదరాబాద్, మే 28: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. రద్దైన NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించే గడువును జూన్ 22 రాత్రి 11:50 గంటల వరకు పొడిగించింది. ముందుగా ఈ గడువు మే 27తో ముగియాల్సి ఉండగా, విద్యార్థుల సౌకర్యార్థం దాదాపు నెలరోజుల పాటు పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు ఎన్‌టీఏ ‘ఎక్స్’లో ప్రకటన విడుదల చేసింది. మే 23 నుంచి ప్రత్యేక రీఫండ్ లింక్ అందుబాటులోకి తీసుకురావడంతో ఇప్పటివరకు సుమారు 13 లక్షల మంది అభ్యర్థులు తమ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసినట్లు వెల్లడించింది.
అభ్యర్థులు తమ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి NEET UG 2026 పోర్టల్‌లోకి ప్రవేశించి రీఫండ్ లింక్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే రద్దు చేసిన చెక్ (Cancelled Cheque) కాపీని కూడా అప్‌లోడ్ చేయవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. ఒక్కసారి బ్యాంక్ వివరాలు సమర్పించిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు వివరాలు నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
NEET UG 2026 పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్, అక్రమాల ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం చెలరేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టగా, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. మే 3న భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 22 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం మే 12న పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్టీయే రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటించింది. రీ-ఎగ్జామినేషన్‌ను జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షలో అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చే ఏడాది నుంచి NEET UG పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మీడియా సమక్షంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
12వ తరగతి విద్యార్థుల కోసం సీబీఎస్సీ ఒక 24×7 హెల్ప్‌లైన్ ప్రారంభించింది. ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులకు సహాయం అందించే ఉద్దేశంతో, CBSE ‘ఫలితాల అనంతర విద్యార్థి సహాయక’ (Post-Result Support for Students) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఫలితాలు, మూల్యాంకనం, ఒత్తిడి నిర్వహణకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు సహాయం అందించేలా ఈ సహాయక వ్యవస్థ పని చేయనుంది. అలాగే టెలి-కౌన్సెలింగ్ సదుపాయం కూడా కల్పించనున్నారు. విద్యార్ధులు టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 1800-11-8004కు ఫోన్ చేయవచ్చు. లేదంటే.. విద్యార్థులు అధికారిక ఈమెయిల్ info.cbse@nic.in లేదా resultcbse2026@cbseshiksha.in ద్వారా కూడా సహాయం పొందవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.