NEET UG 2026లో OMR షీట్లపై వివాదం.. సుప్రీం తలుపుతట్టిన ఆరుగురు విద్యార్థులు

NEET-UG 2026 పరీక్షలో OMR షీట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము పరీక్షలో గుర్తించిన సమాధానాలు, NTA విడుదల చేసిన OMR కాపీల్లోని సమాధానాలు భిన్నంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర విచారణ కోరగా సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది..

NEET UG 2026లో OMR షీట్లపై వివాదం.. సుప్రీం తలుపుతట్టిన ఆరుగురు విద్యార్థులు
NEET UG OMR Discrepancy issue

Updated on: Aug 05, 2026 | 5:54 PM

హైదరాబాద్, ఆగస్ట్ 5: NEET-UG 2026 పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులు తమ OMR సమాధాన పత్రాలపై వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షలో తాము గుర్తించిన సమాధానాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన OMR షీట్లలో కనిపిస్తున్న సమాధానాలు ఒకేలా లేవని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అత్యవసరం ఏమిటి? అని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది సమాధానం చెబుతూ.. NEET-UG కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని, ఈ పిటిషన్ కేవలం ఆరుగురు విద్యార్థులకు సంబంధించినదని వివరించారు. దీంతో ఈ కేసును విచారణకు జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

‘OMR షీట్లలో మా సమాధానాలు మారిపోయాయ్‌..’

నీట్ విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం పరీక్ష సమయంలో తాము గుర్తించిన సమాధానాలు.. NTA విడుదల చేసిన OMR కాపీల్లోని సమాధానాలు భిన్నంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యత్యాసాల వల్ల తమ మార్కులు, ర్యాంకుపై తీవ్ర ప్రభావం పడిందని వారు వాదిస్తున్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఉన్న ఆరుగురు అభ్యర్థులు NEET-UG 2026లో 600 నుంచి 650కు పైగా మార్కులు సాధించిన వారు. OMR షీట్లలోని వ్యత్యాసాల కారణంగా తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వివరించారు.

ఇవి కూడా చదవండి

కౌన్సెలింగ్‌కు ముందే విచారణ కోరిన అభ్యర్థులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా NEET-UG 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. అడ్మిషన్లపై ప్రభావం పడకముందే ఈ అంశాన్ని విచారించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us