Study Tips: ఇలా చదివితే మీరే క్లాస్ టాపర్! టాప్ ర్యాంకర్లకు తెలిసిన సీక్రెట్ ఇదే..

కొందరు రోజూ పుస్తకాలతో కుస్తీ పడుతారు. అయితే పరీక్షల సమయానికి ఏమీ గుర్తుకు రావడం లేదని చెతులెత్తేస్తారు. ఎక్కువ గంటలు చదవడం కంటే తెలివిగా, అర్థవంతంగా చదవడం అలవాటు చేసుకోవడం ముఖ్యం. పరీక్షలకు ముందు ఏమీ గుర్తుకు రావడం లేదని బాధపడటం కంటే.. ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా చదివితే మీరే క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తారు. 

Study Tips: ఇలా చదివితే మీరే క్లాస్ టాపర్! టాప్ ర్యాంకర్లకు తెలిసిన సీక్రెట్ ఇదే..
Study Tips

Updated on: Aug 14, 2026 | 4:32 PM

ఎంత శ్రద్ధగా చదివినా కాసేపటికే చదివిన విషయాలు గుర్తుకు రాకపోవడం చాలా మంది ఎదుర్కొనే సమస్యే. రోజూ చదివినా పరీక్షల సమయానికి చదివిన విషయాలు గుర్తుకు రాక విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇతరులతో పోలిస్తే వెనుకబడిపోతుంటారు. ఒకసారి చదివిన సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలంటే కేవలం గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటే సరిపోదు. సరైన నిద్ర, చదివే విధానం, రివిజన్, ఏకాగ్రతతో పాటు కొన్ని సులభమైన టెక్నిక్స్‌ను అలవాటు చేసుకోవాలి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి నిపుణులు, టాప్ ర్యాంకర్లు సూచించే కొన్ని సీక్రెట్ టిప్స్ ఇవే..

నిద్ర విషయంలో రాజీపడొద్దు

మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి. నిద్ర సమయంలో మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి, ముఖ్యమైన విషయాలను జ్ఞాపకాల్లో నిల్వ చేసుకునే ప్రక్రియ జరుగుతుంది. అందుకే రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోవాలి. నాణ్యమైన నిద్ర అందేలా చూసుకోవాలి. చదువు కోసం నిద్రను తగ్గించడం వల్ల ఏకాగ్రత, గుర్తుంచుకునే సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

చదవడమే కాదు.. ఆలోచించాలి

పుస్తకాన్ని చూస్తూ చదవడం మాత్రమే కాకుండా, చదివిన విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశాన్ని చదివిన తర్వాత దాని గురించి మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి. ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేయడం. ఇలా యాక్టివ్ లెర్నింగ్‌ పద్ధతిని పాటిస్తే సమాచారం మెదడులో ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విజువలైజేషన్‌ టెక్నిక్‌ ఉపయోగించండి

కొత్త విషయాలను గుర్తుంచుకోవడానికి విజువలైజేషన్‌ మంచి పద్ధతిగా ఉపయోగపడుతుంది. మీరు చదివే అంశాన్ని కళ్ల ముందు ఒక చిత్రం లేదా సంఘటన రూపంలో ఊహించుకోండి. ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను డయాగ్రామ్‌లు, చార్టులు లేదా మైండ్ మ్యాప్స్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇలా సమాచారాన్ని ఒక దృశ్యంతో లింక్ చేయడం వల్ల అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం సులభమవుతుంది.

చదివిన వెంటనే రీకాల్ చేయండి

ఒక అంశాన్ని చదివిన తర్వాత పుస్తకాన్ని మూసివేసి, ఇప్పుడే ఏం చదివారో మీకు మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పాయింట్లను గుర్తు చేసుకోవాలి. ఈ విధానాన్ని యాక్టివ్ రీకాల్ అంటారు. కేవలం మళ్లీ మళ్లీ చదవడం కంటే చదివిన విషయాన్ని జ్ఞాపకాల నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

పెద్ద టాపిక్‌ను చిన్న భాగాలుగా విభజించండి

ఒకేసారి పెద్ద మొత్తంలో సమాచారాన్ని చదవడానికి ప్రయత్నిస్తే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే పెద్ద అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని చదవండి. ప్రతి భాగానికి ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోండి. దీంతో చదవడం, అర్థం చేసుకోవడం, తర్వాత రివిజన్ చేయడం సులభమవుతుంది.

రివిజన్‌కు ప్రత్యేక సమయం కేటాయించండి

ఒక్కసారి చదివితే సమాచారం శాశ్వతంగా మెదడులో గుర్తుండే అవకాశం ఉండదు. అందుకే చదివిన విషయాలను నిర్ణీత వ్యవధుల్లో మళ్లీ గుర్తు చేసుకోవాలి. పరీక్షలకు ముందు మాత్రమే రివిజన్ చేయకుండా.. రోజువారీ చదువులోనే పాత అంశాలను తిరిగి పరిశీలించడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది.

వ్యాయామం, ఆహారం కూడా ముఖ్యం

మెదడు పనితీరుపై జీవనశైలి కూడా ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ కొంత సమయం శారీరక వ్యాయామానికి కేటాయించడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి అలవాట్లు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే చదువుపై ఏకాగ్రత పెట్టడం కూడా సులభమవుతుంది.

ఇతరులతో చర్చించండి

మీరు నేర్చుకున్న విషయాలను స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చించడం మరో మంచి పద్ధతి. ఒక అంశాన్ని ఇతరులకు వివరించే ప్రయత్నం చేసినప్పుడు దానిపై మీ అవగాహన మరింత స్పష్టమవుతుంది. అలాగే ఏ అంశంలో మీకు ఇంకా సందేహాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us