School Holiday Today: విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఈ రోజు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవ్‌!

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ కేరళ, మణిపూర్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక ఫైనల్‌ను విద్యార్థులు వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

School Holiday Today: విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఈ రోజు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవ్‌!
School Holiday On July 20

Updated on: Jul 20, 2026 | 8:55 AM

ఫుట్‌బాల్‌పై భారతీయులకున్న అభిమానం మరోసారి ప్రత్యేకంగా కనిపించింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌ను వీక్షించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ కేరళ, మణిపూర్, మేఘాలయ, కోల్‌కతా రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం (జులై 20) పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. ఫుట్‌బాల్‌ చాంపియన్ పోరులో స్పెయిన్‌ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్‌ అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సోమవారం తెల్లవారుజామున 12:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు కేరళ సాధారణ విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించింది. విద్యార్థులు ఆదివారం రాత్రి ఆలస్యంగా మ్యాచ్ వీక్షించాలనుకుంటున్నారని వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎన్. సంసుద్దీన్ తెలిపారు. సెలవు ప్రకటన చేస్తూ ఆయన సామాజిక మాధ్యమాల్లో ‘..ఇప్పుడు సంతోషమేనా పిల్లలూ?’ అని సరదాగా వ్యాఖ్యానించారు

అటు మణిపూర్ ప్రభుత్వం కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్‌ఈ తదితర బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. అనంతరం మేఘాలయ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం టైటిల్ పోరాటమే కాకుండా మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా కలిగి ఉంది. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. ప్రపంచ ఫుట్‌బాల్ భవిష్యత్తు తారగా గుర్తింపు పొందుతున్న యమాల్‌కు, ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన మెస్సీకి మధ్య పోటీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

అర్జెంటీనా తన నాలుగో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ కోసం బరిలోకి దిగుతుండగా, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్‌ను నిలబెట్టుకున్న తొలి పురుషుల జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు స్పెయిన్ 2010 తర్వాత రెండో ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. భారత్‌లో మెస్సీకి అపారమైన అభిమాన వర్గం ఉంది. గత ఏడాది ఆయన భారత పర్యటన సందర్భంగా వేలాది మంది అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే పైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఫిఫా ప్రపంచకప్‌ స్పెయిన్‌ను వరించింది. ఇరుజట్లు గోల్‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. మ్యాచ్‌ నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో.. ఎక్స్‌ట్రా టైమ్‌ కేటాయించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 106వ నిమిషంలో స్పెయిన్‌ ప్లేయర్‌ ఫెర్రాన్‌ టొర్రెస్‌ గోల్‌ కొట్టడంతో పోరు ముగిసింది. ఇది స్పెయిన్‌కు రెండో ప్రపంచకప్‌ టైటిల్. 2010లో తొలిసారి విజేతగా నిలిచింది. 2023 నేషన్స్‌ లీగ్, 2024 యూరో కప్‌ గెలిచిన స్పెయిన్‌.. ఇప్పుడు ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

Follow Us