
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష ఫలితాలు జూన్ 1న వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) త్వరలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. IIT, NIT, IIEST, IIIT ఇతర GFTIలలో JoSAA 2026 ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుంది. అందుకు అభ్యర్థులందరూ అధికారిక JoSAA ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవల్సి ఉంటుంది.
ఈ సంస్థలు అందించే అన్ని అకడమిక్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్లు JoSSA ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే నడిచే ఇతర విద్యా సంస్థలకు కూడా JEE మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే జూన్ 3 నుంచి JoSAA రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
గత ఏడాది జేఈఈ మెయిన్ ర్యాంకును ఏప్రిల్ 17న ప్రకటించారు. అనతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించారు. ఇక గత ఏడాది JoSAA కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జూన్ 3 నుంచి ప్రారంభమైనాయి. జూన్ 14న సీట్ల కేటాయింపు మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించింది. అభ్యర్థులు జూన్ 14 నుండి 22 వరకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసింది. జూన్ 25న రెండవ విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ప్రకటించింది. ఐఐటీల తుది రౌండ్ (6వ రౌండ్) సీట్ల కేటాయింపు ఫలితం జూలై 16న విడుదలైంది. కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించడమైనది.