
హైదరాబాద్, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా ఉన్న NITలు, ఐఐటీల్లో, ట్రిపుల్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) సెషన్ 1 ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదలకానున్నాయి. ఈ మేరకు ఎన్టీయే ఏర్పాట్లు చేస్తుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీనే విడుదల కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ తేదీని ఫిబ్రవరి 16కి వాయిదా వేశారు. దీంతో సోమవారం (ఫిబ్రవరి 16) జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల చేసేందుకు ఎన్టీయే సన్నాహాలు చేస్తుంది. JEE మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలను జనవరి 21 నుంచి జనవరి 29 వరకు మొత్తం 10 షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌కు నిర్వహించిన పేపర్ 2 పరీక్ష జనవరి 29న జరిగింది. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా మొత్తం 13.50 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవగా ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సెషన్ 1 పరీక్షలు రాసిన వారు కూడా జేఈఈ మెయిన్ మలి విడత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన విద్యార్ధులు మళ్లీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ వెల్లడించింది. చివరి విడత పరీక్షలు కూడా పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి జాతీయ ర్యాంకులను వెల్లడిస్తారు. JEE మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు రోజుకు రెండు షిఫ్టులలో జరగనున్నాయి.
ఇక జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు సాధించిన తొలి 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. దీని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ ఏడాదికి మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్-2026ను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో మొత్తం 18,160 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.