CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు ఈ కొత్త విధానం నుంచి మినహాయింపు కల్పించింది CBSE. విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని బోర్డు వెల్లడించింది..

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!
CBSE Three Language Formula

Updated on: Jun 29, 2026 | 5:02 PM

న్యూఢిల్లీ, జూన్ 29: జాతీయ విద్యా విధానం (NEP)–2020 అమలులో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త త్రిభాషా విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు భాషా విద్యకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడం, భారతీయ భాషల పట్ల అవగాహన పెంచడం, విద్యను మరింత ఆచరణాత్మకంగా తీర్చిదిద్దడం ఈ విధానం ప్రధాన లక్ష్యమని బోర్డు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. మూడవ భాష భారతీయమైనా లేదా విదేశీ భాషైనా కావచ్చు. అయితే మిగిలిన రెండు భాషలు భారతీయ భాషలై ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కొత్త త్రిభాషా విధానం వర్తించదు. వారు ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారమే రెండు భాషలతో తమ విద్యను పూర్తి చేయవచ్చు. అదనంగా మూడవ భాషను తీసుకోవాల్సిన అవసరం లేదు.

9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి

2026-27లో 9వ తరగతిలో చేరే విద్యార్థులందరూ మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు భారతీయ భాషలను చదువుతున్న విద్యార్థులు తమ మూడవ భాషగా ఇంగ్లీష్, ఫ్రెంచ్ లేదా ఇతర భాషలను ఎంచుకోవచ్చు. ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష చదువుతున్నవారు మాత్రం మూడవ భాషగా తప్పనిసరిగా మరో భారతీయ భాషను ఎంపిక చేసుకోవాలి. రెండు విదేశీ భాషలను చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక మినహాయింపు కల్పించినప్పటికీ, అదనంగా ఒక భారతీయ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది.

మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు

9వ తరగతి విద్యార్థులకు మూడవ భాషకు సంబంధించిన మూల్యాంకనం పాఠశాల స్థాయిలోనే నిర్వహించబడుతుంది. 10వ తరగతికి చేరుకున్న తర్వాత కూడా ఆ భాషకు సంబంధించి CBSE బోర్డు పరీక్ష ఉండదని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రిని CBSE, NCERT అందించనున్నాయి. ప్రస్తుతం 6, 7, 8వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో 9వ, 10వ తరగతులకు చేరుకున్నప్పుడు త్రిభాషా విధానం పూర్తిగా అమల్లోకి వస్తుంది. 2026-27లో 6వ తరగతి మరియు అంతకంటే తక్కువ తరగతుల విద్యార్థుల కోసం భవిష్యత్తులో మూడవ భాషకు సంబంధించిన బోర్డు పరీక్షను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని CBSE తెలిపింది.

ఇవి కూడా చదవండి

వీరికీ ప్రత్యేక మినహాయింపులు

RPwD చట్టం-2016 ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. విదేశాల్లోని CBSE పాఠశాలల విద్యార్థులు, విదేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చే విద్యార్థులకు మూడవ భారతీయ భాష నుంచి మినహాయింపు ఇవ్వబడుతుంది. అలాగే తల్లిదండ్రుల బదిలీల కారణంగా రాష్ట్రాలు మారిన విద్యార్థులు తమ పాత భాషా విధానాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన అధ్యాపకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని CBSE సూచించింది. అలాగే ఆన్‌లైన్, హైబ్రిడ్ బోధన విధానాలను కూడా ఉపయోగించుకునేందుకు పాఠశాలలకు అనుమతి ఇచ్చింది. విద్యార్థులపై అదనపు పరీక్షల భారం మోపడం తమ ఉద్దేశం కాదని, భారతీయ భాషలతో వారిని అనుసంధానించి బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని CBSE స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us