
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు మరో తీపికబురు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో నవంబర్ 2, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ నియామకాలు మంచి అవకాశంగా నిలవనున్నాయి. ఈ నియామకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.
మొత్తంగా 503 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జలవనరుల శాఖలో అత్యధికంగా 224 ఖాళీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 100 పోస్టులు, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ విభాగంలో 73 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏఎంఐఈ (AMIE – Institution of Engineers, India) పరీక్షలో సెక్షన్ ‘A’, ‘B’ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హత పొందవచ్చు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే పోస్టుకు సంబంధించిన నిర్దిష్ట విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 22, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక కోసం ఏపీపీఎస్సీ ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) నిర్వహించనుంది. ఈ నియామక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. రాత పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) నిర్వహిస్తారు. పరీక్ష విధానం, సిలబస్, మార్కుల విభజన తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా తెలుసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు వేతనం లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంటుంది.
ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.