ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. అలాగే పరీక్ష “కీ”ని సైతం విడుదల చేసేసింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించింది. పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా చెప్పిన టైంకి అధికారిక వెబ్‌సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ అప్ లోడ్ చేసినట్లుగా అధికారలు తెలిపారు. జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అభ్యంతరాలను తెలిపేందుకు మెయిల్ ఐడీ కేటాయించింది రిక్రూట్‌మెంట్ బోర్డు. ఏపీ వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది పోలీసు నియామక మండలి.
పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షను నిర్వహించారు. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
కాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితిని పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఏపీఎస్‌పీ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.