
అమరావతి, ఆగస్ట్ 22: రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ శుక్రవారం (ఆగస్టు 22) విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం ప్రకటించారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితాను కూడా ఈ రోజు విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదిరి మార్కులు, ర్యాంకులతో కూడిన మెరిట్ జాబితాను విడుదల చేయకుండా.. నేరుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్ధుల జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలని సూచించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లను, అలాగే ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో సంతకం (అటెస్టెడ్) చేసిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు ఫొటోలను తీసుకుని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఎంపికైన అభ్యర్ధులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. మెరిట్‌లిస్ట్‌లోని అభ్యర్ధుల్లో ఎవరైనా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా గుర్తించినా.. అటువంటి అభ్యర్ధుల అవకాశం రద్దు అవుతుంది. మెరిట్‌లిస్ట్‌లో ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని మధ్యవర్తులం అంటూ కొందరు దళారులు అభ్యర్ధులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ హెచ్చరించారు. అలాగు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వందతులను సైతం నమ్మొద్దు, దుష్ప్రచారాలను, వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.