అమరావతి, నవంబర్ 12: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యుద్ధప్రాతిపదికన డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. బుధవారం (నవంబరు 13) శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 1998 డీఎస్సీ ద్వారా మిగిలిన వారికి ఉద్యోగాలిచ్చే విషయంపై ప్రశ్నించగా.. దీనిపై లోకేశ్ సమాధానం ఇచ్చారు. ‘సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇటీవలే 16,000 పైచిలుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. న్యాయవివాదాల పరిష్కారం తర్వాత త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేసి, పోస్టులను భర్తీ చేస్తామని లోకేశ్ వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
1998 డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారిలో 18,008 మంది నియమితులయ్యారని లోకేశ్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 4,534 పోస్టుల్లో ఎంటీఎస్ ద్వారా 3,939 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. మిగిలిన సుమారు 600 పోస్టుల భర్తీ ఎలా చేయాలన్న దానిని పరిశీలిస్తున్నామన్నారు. ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉండవని వివరించారు. అయితే వీరికి రిటైర్‌మెంట్ వయసు ఎంతనే దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయిదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని లోకేశ్ వివరించారు. పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా వచ్చే ఏడాది భర్తీచేస్తామని తెలిపారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలంలోనే గిరిజన యూనివర్సిటీని రానున్న రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి 5 ఏళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని ఆయన ఆరోపించారు. అయితే 2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తిచేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు విభజనచట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై శాసనసభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు.