
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగ ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు AI కారణంగా పలు ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలనే చర్చ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రోజుకు గంటల కొద్దీ పనిచేయాల్సిన అవసరం లేదని.. నిజమైన ఏకాగ్రతతో నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 3న బెంగళూరులో జరిగిన 18వ ‘ఎడిషన్ సప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ (PMSAC)’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను రోజుకు నాలుగు గంటలు పనిచేస్తాను. పూర్తి అంకితభావంతో పనిచేస్తే ఆ సమయం సరిపోతుంది’ అని చేతన్ భగత్ అన్నారు. అయితే తాను చెప్పే నాలుగు గంటల పని సమయానికి సమావేశాలు, విరామాలు, ఇతర పనులతో ఏర్పడే అంతరాయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. నిజంగా ఏకాగ్రతతో నాలుగు గంటలు పనిచేస్తే అది మంచి ఉత్పాదకతకు సరిపోతుందని పేర్కొన్నారు. ఆ నాలుగు గంటల్లో చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇచ్చి.. అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగి కార్యాలయంలో ఎంతసేపు ఉన్నాడన్నదాని కంటే.. ఆ సమయంలో ఎంత నాణ్యమైన పని చేశాడనేదే ముఖ్యమని చేతన్ భగత్ అభిప్రాయపడ్డారు. AI వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో మనుషులు గంటల తరబడి చేసే అనేక పనులను ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీలు తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి. దీంతో ఉత్పాదకత, ఉద్యోగ భద్రత, ఆటోమేషన్ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
భారత్‌లో పని గంటలపై గతంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో సూచించారు. దేశ ఉత్పాదకత, పోటీతత్వం పెరగాలంటే ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా నాలుగు దశాబ్దాలకు పైగా వారానికి 70 గంటలు పనిచేశానని, భారత్‌లో ఆరు రోజుల పని విధానం ఉన్న సమయంలో వారానికి 85 నుంచి 90 గంటల వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయని నారాయణమూర్తి గతంలో వెల్లడించారు. అయితే చేతన్ భగత్ మాత్రం ఎక్కువ గంటలు పనిచేయడంపై కాకుండా ఏకాగ్రత, ప్రాధాన్యత క్రమం, వ్యక్తిగత సంతోషంపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. బెంగళూరు సమావేశంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చేతన్ భగత్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన.. వ్యక్తులు తమకు సంతోషాన్ని ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. తన ‘11 Rules for Life’ పుస్తకంలోని కొన్ని సూత్రాలను ప్రస్తావిస్తూ.. జీవితంలో ఏం చేయాలి, ఏ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై స్పష్టత ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. AI యుగంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో.. ఎక్కువ గంటలు పనిచేయడం కంటే తక్కువ సమయంలో పూర్తి ఏకాగ్రతతో నాణ్యమైన పని చేయడం ముఖ్యమనే చేతన్ భగత్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.