
నేటి డిజిటల్ యుగంలో నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీల కోసం ఇప్పటికీ చాలా మంది చెక్కుల పైనే ఆధారపడుతున్నారు. అయితే చెక్కు ద్వారా డబ్బు విత్‌డ్రా చేసే సమయంలో బ్యాంక్ అధికారులు తరచూ చెక్కు వెనుక వైపు సంతకం చేయమని అడుగుతుంటారు. చెక్కు ముందు భాగంలో ఇప్పటికే సంతకం ఉన్నప్పటికీ, వెనుక వైపు మళ్లీ ఎందుకు సంతకం అడుగుతారో? ఏ చెక్కులకు ఇది తప్పనిసరో చాలా మందికి తెలియదు.
గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అన్ని రకాల చెక్కుల వెనుక సంతకం చేయాల్సిన అవసరం లేదు. కేవలం బేరర్ చెక్కుల కు మాత్రమే వెనుక వైపు సంతకం అడుగుతారు.
బేరర్ చెక్కు: ఈ చెక్కును ఎవరైనా బ్యాంకుకు తీసుకువెళ్లి నగదుగా మార్చుకోవచ్చు.
ఆర్డర్ చెక్కు: ఈ చెక్కుపై ఎవరి పేరు రాసి ఉంటుందో, వారు మాత్రమే బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకోగలరు. ఇందులో సదరు వ్యక్తి గుర్తింపును బ్యాంక్ సిబ్బంది పూర్తిగా విచారించి, ధృవీకరించుకున్నాకే డబ్బు ఇస్తారు కాబట్టి దీనికి వెనుక వైపు సంతకం తప్పనిసరి కాదు.
దారిలో ఎవరైనా బేరర్ చెక్కును పోగొట్టుకున్నా లేదా అది దొంగిలిస్తే డబ్బు పోయే ప్రమాదం ఉంది. అది చోరి చేసిన వ్యక్తి బ్యాంకుకు వెళ్లి సులభంగా డబ్బు డ్రా చేసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి మోసాలను నివారించడానికి, భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంక్ సిబ్బంది ఒక ఎత్తుగడ వేస్తారు. డబ్బు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తితో చెక్కు వెనుక వైపు సంతకం చేయించుకుంటారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తప్పుడు వ్యక్తికి డబ్బు చేరిందని తేలితే ఆ సొమ్మును సదరు వ్యక్తి బాధ్యతపైనే చెల్లించినట్లు నిరూపించడానికి ఈ సంతకం ఒక పక్కా ఆధారంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ విత్‌డ్రా చేయాల్సిన మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే డబ్బు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిని బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా గుర్తింపు ధృవీకరణ పత్రం అడుగుతారు. ఆ తర్వాతే నగదు అందజేస్తారు.
ఒకవేళ ఎవరైనా చెక్కు వెనుక సంతకం చేయడానికి నిరాకరిస్తే, వారు స్వయంగా డబ్బు స్వీకరిస్తున్నట్లు ఒక దరఖాస్తును జతచేయాల్సి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి తన సొంత ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి తనే స్వయంగా బ్యాంకుకు వెళ్తే, అప్పుడు బేరర్ చెక్కుకు కూడా వెనుక వైపు సంతకం అవసరం లేదు. వేరొకరి అభ్యర్థన మేరకు మూడవ వ్యక్తి బేరర్ చెక్కుతో నగదు తీసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ సంతకం ఖచ్చితంగా అవసరమవుతుంది. కాబట్టి చెక్కు లావాదేవీలు జరిపేటప్పుడు ఈ విషయాలను గుర్తి పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పని పూర్తవుతుంది.