
కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో గతంలో ఎక్కువగా కనిపించిన 25 కిలోల బియ్యం బస్తాల స్థానంలో ఇప్పుడు 26 కిలోల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బస్తా బరువును ఒక కిలో పెంచడం వెనుక వ్యాపారుల వ్యూహం ఉందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వెనుక పెద్ద మతలబు దాగి ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.
జీఎస్టీ నుంచి తప్పించుకునే మార్గం!
2022 జులై నుంచి ముందుగా ప్యాక్ చేసి, లేబుల్ వేసిన బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించింది. అయితే 25 కిలోలు లేదా అంతకంటే తక్కువ బరువున్న ప్యాకేజీలకే ఈ పన్ను వర్తించేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఈ పరిమితిని దాటితే పన్ను భారం తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
లీగల్ మెట్రాలజీ నిబంధనలు ఎలా?
2011 లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనల్లో 25 కిలోలకు మించిన కొన్ని ప్యాకేజీలకు రిటైల్ ప్యాకేజింగ్ నిబంధనల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని కొందరు మిల్లర్లు 25 కిలోల బస్తాల స్థానంలో 26 కిలోల ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం తమిళనాడులోని తిరుప్పూర్ ప్రాంతం నుంచి మొదలై ఇతర ప్రాంతాలకు విస్తరించింది.
వినియోగదారులకు నష్టమా?
26 కిలోల బస్తా కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులకు నేరుగా నష్టం జరుగుతుందా? అనేది ధరపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,250 అయితే, కిలోకు రూ.50 అవుతుంది. అదే ధర ప్రకారం 26 కిలోల బస్తా రూ.1,300కు విక్రయిస్తే కిలో ధరలో మార్పు ఉండదు. అయితే బస్తా మొత్తం ధరతోపాటు కిలో ధరను పోల్చి చూసిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిది. మొత్తంగా, 26 కిలోల ప్యాకింగ్ వెనుక జీఎస్టీ, ప్యాకేజింగ్ నిబంధనల ప్రభావం కనిపిస్తోంది. అయితే 25 కిలోలు దాటిన ప్రతి ప్యాకేజీకి ఆటోమేటిక్గా పన్ను మినహాయింపు వస్తుందని భావించకూడదు. ప్యాకేజీ స్వభావం, విక్రయ విధానం, వర్తించే జీఎస్టీ నిబంధనల ఆధారంగా పన్ను బాధ్యత నిర్ణయమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..