
చాలామంది ఉద్యోగాలతో విసిగిచెంది ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటుంటారు. కొంతమంది ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మొదలుపెడుతుంటారు. ఇలా పెట్టి సక్సెస్ అయినవారు కొందరుంటే.. నష్టపోయినవారు కూడా ఉన్నారు. అయితే వ్యాపారం మొదలుపెట్టాలంటే లక్షలకు లక్షలు అవసరమవుతాయని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో నిజం లేదు. కేవలం రూ.లక్షలో మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు. సరైన ప్రణాళిక, మంచి వ్యాపారం ఎంచుకుంటే రూ.లక్ష పెట్టుబడితో వ్యాపారంలో రాణించవచ్చు. తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు తెచ్చుకోగలిగే వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
పట్టణాలు, సిటీల్లో ఫుడ్, కేటరింగ్ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఉంది. మీకు వంట చేయడం ఇష్టమైతే.. మీ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థుల కోసం టిఫిన్ సర్వీస్‌ను ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కేవలం పాత్రలు, ప్యాకేజింగ్ సామాగ్రి, సరుకుల కోసం రూ.20 వేల నుంచి రూ.40 వేలు ఉంటే సరిపోతుంది. దీని ద్వారా రోజువారీ మీకు ఆదాయం లభిస్తుంది. మీరు స్విగ్గీ లేదా జొమాటో వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించవచ్చు.
మీకు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, SEO, కంటెంట్ రైటింగ్, లేదా గ్రాఫిక్ డిజైనింగ్‌లో స్కిల్స్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంచుకోండి. స్థానిక వ్యాపారాలు, కంపెనీలను సంప్రదించి వారికి డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించండి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి ల్యాప్‌టాప్, హై స్పీడ్ వైఫై, ఇతర ఖర్చుల కోసం కేవలం రూ.70 వేలు ఉంటే సరిపోతుంది.
మీరు ఎలాంటి దుకాణం తెరవకుండానే డ్రాప్ షిప్పింగ్ ద్వారా ఆన్లైన్‌లో వస్తువులను విక్రయించి ఆదాయం పొందవచ్చు. మీరు స్వంతగా సరుకును కొనుగోలు చేయకుండానే ఒక ప్రత్యేక వెబ్ సైట్ క్రియేట్ చేసుకుని ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించవచ్చు. Shopify లేదా GlowRoad వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దుస్తులు, గాడ్జెట్‌లు లేదా గృహాలంకరణ వస్తువులను అమ్మవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి వెబ్‌సైట్ సెటప్, సోషల్ మీడియా ప్రకటనల కోసం రూ.30,000 నుండి రూ.50 వేల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో క్లాసులు, ట్యూషన్లు బోధించడం వల్ల ఆదాయం లభిస్తుంది. మీకు ఏదైనా సబ్జెక్టులో స్కిల్స్ ఉంటే మీ ఇంటి వద్ద నుంచే పని ప్రారంభించవచ్చు. మీకు డిజిటల్ బోర్డ్, మైక్రోఫోన్ లేదా ప్రాథమిక సీటింగ్ ఏర్పాట్ల కోసం కేవలం రూ.10 వేల నుండి రూ.30 వేల వరకు ఖర్చు ఉంటుంది.
అగరబత్తులు, కొవ్వొత్తులు లేదా కాగితపు సంచులు వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసి అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ఇంట్లోని ఒక చిన్న గదిలో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముడి పదార్థాల కోసం రూ.40 వేల నుండి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది.