Credit Card: క్రెడిట్ కార్డు ఊబిలో చిక్కుకున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించి ఖర్చు తగ్గించుకోండి..

|

Apr 19, 2022 | 7:42 AM

Credit Card: క్రెడిట్‌ కార్డ్‌.. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సహజంగా ఉంటున్నదే. అయితే దీన్ని అవసరమైనంత మేరకు వాడినంతవరకూ ఎలాంటి సమస్యలు ఉండదు. అదుపు తప్పితే మాత్రం అనర్థాలు ఎక్కువ.

Credit Card: క్రెడిట్ కార్డు ఊబిలో చిక్కుకున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించి ఖర్చు తగ్గించుకోండి..
Credit Card
Follow us on

Credit Card: క్రెడిట్‌ కార్డ్‌.. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సహజంగా ఉంటున్నదే. అయితే దీన్ని అవసరమైనంత మేరకు వాడినంతవరకూ ఎలాంటి సమస్యలు ఉండదు. అదుపు తప్పితే మాత్రం అనర్థాలు ఎక్కువ. కానీ..సక్రమంగా వినియోగిస్తే క్రెడిట్‌ కార్డంత ఉపయోగకరమైన సాధనం మరొకటి ఉండదు. క్రెడిట్‌ కార్డ్‌ వినియోగంతో వెంటనే చేతి నుంచి డబ్బు(Money) ఖర్చవకపోయినా.. నెలలోపు ఆ మొత్తాన్ని తీర్చకపోతే వడ్డీల బాధుడుతో పాటు, పెనాల్టీలంటూ అప్పులు చుట్టుముడతాయి. ముఖ్యంగా వడ్డీ రహిత(Interest Free) వ్యవధిలో ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించకుండా, కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ క్రెడిట్‌ రోలింగ్‌ చేయడం వల్ల ఆ క్రెడిట్‌ కార్డ్‌ అప్పు తీరటానికి చాలా కాలం పడుతుంది. ఇలా చేయటం వల్ల ఏటా 48 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించే వారు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. క్రెడిట్‌ కార్డ్‌ను విచక్షణతో ఉపయోగించడానికి, తక్కువ వడ్డీతో లేదా అసలు వడ్డీ చెల్లించకుండా వాడాలంటే ఉన్న మార్గాలను పరిశీలిద్దాం..

పూర్తిగా చెల్లించడం..

క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసిన చెల్లింపులకు నెలవారీ స్టేట్‌మెంట్‌ రాగానే, ఇంట్రస్ట్‌ ఫ్రీ గడువులోపు మొత్తంగా చెల్లించేయడం మంచిది. స్టేట్‌మెంట్‌ తేదీ నుంచి చెల్లించడానికి సాధారణంగా 15 రోజుల గడువు ఉంటుంది. అయితే స్టేట్‌మెంట్‌ తేదీకి ముందు రోజునే కొనుగోలు చేస్తే చెల్లింపులకు కేవలం 15 రోజుల గడువే ఉంటుందని గుర్తుంచుకోండి. స్టేట్‌మెంట్‌ తేదీ తర్వాత మొదటి రోజున కొనుగోలు చేస్తే 45 రోజుల వరకు సమయాన్ని పొందవచ్చు. చాలామంది చేసిన ఖర్చులో మెుత్తంలో కేవలం ఐదు శాతం చెల్లించి మిగతా మొత్తాన్ని వచ్చే నెలకు రోలోవర్ చేస్తుంటారు. కానీ దీనివల్ల ఏటా 45 శాతం వడ్డీతోపాటు, అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుంది.

కొత్త ఖర్చులు ఆపాలి..

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేవరకు కొత్త కొనుగోళ్లు జరపకపోవడం మంచిది. డ్యూ పూర్తిగా చెల్లించేంత వరకూ.. కొత్త అప్పు చేయరాదన్న సూత్రాన్ని పాటించండి. లేకపోతే రోలింగ్‌ క్రెడిట్‌ మీద కనీసం నెలకు మూడు నుంచి నాలుగు శాతం వడ్డీభారం తప్పదు. ఈ నెల వడ్డీ వచ్చేనెల అసలుకు కలుస్తుంది. ఇలా జరగటం వల్ల క్రెడిట్ కార్డు అప్పు తీర్చటం భారంగా మారుతుంది.

బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌.. 

క్రెడిట్‌ కార్డ్‌ మీద చేసిన అప్పు తీర్చలేకపోతే, బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అంటే మరో కొత్త క్రెడిట్‌ కార్డ్‌కు ఇప్పుడున్న కార్డ్‌ నుంచి అప్పును బదిలీ చేయడం. ఇలా చేయడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడం వల్ల 3.5 శాతం వడ్డీ కాస్తా 1.8 శాతం వరకు దిగివస్తుంది. రెండు కార్డ్‌లున్నాయి కదా అని విచక్షణారహితంగా క్రెడిట్‌ కార్డ్‌లను ఉపయోగించరాదు.

ఈఎంఐలతో చెల్లింపు..

ఒకవేళ అధిక మొత్తంలో కొనుగోళ్లు జరిపితే, వాటిని వాయిదాలతో చెల్లించండి. దీనిని పాటించటం వల్ల వడ్డీ తగ్గిపోతుంది. కొన్ని ఆఫర్లు నో-కాస్ట్‌ ఈఎంఐలతో ఉంటాయి. అలాంటి వాటిని కొనే ముందే ఆరా తీయండి. ఈఎంఐ ఆఫర్లను స్టోర్లు, క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు ఇస్తాయి. రెండింటిలో ఏది బెటరో కూడా పోల్చిచూసి నిర్ణయం తీసుకోండి. అలాగే ఇప్పటికే పేరుకుపోయిన అప్పును కూడా క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు ఈఎంఐలుగా మార్చుకోవడానికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి. దీనివల్ల క్రెడిట్‌ కార్డ్‌ మీదున్న వడ్డీ 45 శాతం నుంచి సగానికి తగ్గుతుంది.

నగదు విత్‌డ్రా ఆపండి..

క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి నగదును విత్‌డ్రా చేస్తున్నారంటే ఆర్థికంగా మీరు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారని అర్థం. నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ భారం పడుతుంది. నగదు విత్‌డ్రా చేసినా దాన్ని నెలలోపే తీర్చేయండి. లేదంటే పెనాల్టీలు కూడా పడతాయి. అలాగే క్రెడిట్‌ కార్డ్‌ అప్పును వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద కూడా తీర్చేయవచ్చు. సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌లో సగానికి మించి ఖర్చు చేయకండి. అప్పు ఎక్కువగా ఉండే కొద్దీ మీ సిబిల్‌ స్కోరు కూడా తగ్గుతుంది.

ఇవీ చదవండి..

Hyderabad: రివర్స్ పేమెంట్స్ పేరుతో కొత్తరకం సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం