
పశ్చిమ ఆసియాలో అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ, ఆర్థిక మార్కెట్లలో విరుద్ధ ధోరణి కనిపిస్తోంది. ఒకవైపు ఇంధన ధరలు పెరుగుతూ, ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నారు. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్లు నిధుల సమీకరణ రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఒప్పందాలను వేగంగా ముగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు మరింత దిగజారే అవకాశంపై భయంతో ముందస్తుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తీసుకున్న ఆకస్మిక వాణిజ్య నిర్ణయాల ప్రభావం ఇంకా మార్కెట్‌పై కనిపిస్తోంది.
ఈ నేపధ్యంలో ఉత్తర అమెరికాలో మాత్రమే సుమారు 1.14 ట్రిలియన్ డాలర్ల విలువైన M అండ్ A ఒప్పందాలు ఈ త్రైమాసికంలో పూర్తయ్యాయి, ఇది గత దశాబ్దంలో మూడవ అతిపెద్ద స్థాయి. అయితే ఈ వృద్ధి వెనుక ఉన్న వాస్తవ పరిస్థితి అంత సానుకూలంగా లేదు. హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి, సాధారణ ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతోంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ మరియు మందగిస్తున్న ఆర్థిక వృద్ధి కారణంగా కంపెనీలు ఉద్యోగాల కోతలకు మొగ్గు చూపుతున్నాయి.
పెద్ద ఆర్థిక సంస్థల పనితీరులో కూడా మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. జెఫరీస్ ఫైనాన్షియల్ గ్రూప్ అధిక ఫీజులు సంపాదించినప్పటికీ, కొన్ని రుణాలపై నష్టాల కారణంగా ఆశించిన లాభాలను సాధించలేకపోయింది. మరోవైపు ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కొనుగోలు వంటి భారీ ఒప్పందాలు కొనసాగుతుండగా, జేపీ మోర్గాన్ చేజ్ వంటి సంస్థలు ఈ డీల్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ ఒప్పందాల్లో సౌదీ పెట్టుబడులు, అంతర్జాతీయ నిధుల భాగస్వామ్యం పెరగడం గ్లోబల్ ఫైనాన్స్‌లో ఉన్న చురుకుదనాన్ని చూపిస్తోంది. అయితే ఈ స్వర్ణయుగం ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే, ఆర్థిక మార్కెట్లు అకస్మాత్తుగా కుదేలయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. త్వరలో గోల్డ్‌మన్ సాచ్స్ వంటి ప్రధాన బ్యాంకుల ఆర్థిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, మార్కెట్‌లోని వాస్తవ పరిస్థితి మరింత స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి