
దేశంలో డిజిటల్ లావాదేవీలకు సంబంధించి అక్టోబర్ 15 నుండి సరికొత్త మార్పులు రానున్నాయి. రూ.2,000 దాటిన కొన్ని నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో రోజువారీ లావాదేవీల కోసం యూపీఐ వాడటం మానేసి, తిరిగి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల వైపు చూడాలా అన్న చర్చ వినియోగదారుల్లో మొదలైంది. అయితే క్రెడిట్, డెబిట్ కార్డులతో పోలిస్తే ఈ కొత్త ఛార్జీ విధించిన తర్వాత కూడా యూపీఐ చెల్లింపులే అత్యంత చౌకైనవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
మొదటగా వినియోగదారులు తెలుసుకోవాల్సిన ప్రధాన విషయమేమిటంటే.. ఈ కొత్త ఛార్జీ సాధారణ ప్రజలపై ఎలాంటి భారం మోపదు. ఎండీఆర్ అనేది వ్యాపారులు చెల్లించే ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తప్ప, చెల్లింపులు చేసే కస్టమర్ల ఖాతాల నుంచి కట్ కాదు. వ్యాపారులు కూడా ఈ మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా యూపీఐ యాప్‌లు ఎండీఆర్ సాకుతో వినియోగదారుల నుంచి ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేదా ప్లాట్‌ఫామ్ ఫీజులు తీసుకోకుండా నిషేధం విధించారు. ఎలాంటి లావాదేవీల పరిమితి లేకుండా ప్రజలు ఎప్పటిలాగే ఉచితంగా యూపీఐని వాడుకోవచ్చు.
సాధారణంగా జరిగే రోజువారీ యూపీఐ చెల్లింపుల్లో దాదాపు 96 శాతం లావాదేవీలు రూ.2,000 లోపే ఉంటాయి కాబట్టి వాటిపై ఎండీఆర్ సున్నాగా ఉంటుంది. ఇక వీధి వ్యాపారులు, చిరు వ్యాపారాలు, కిరాణా దుకాణాలు పర్సన్ టు పర్సన్ మర్చంట్ పరిధిలోకి వస్తాయి. వీరు క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు స్వీకరించే రూ.1 లక్ష వరకు లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. దీనివల్ల లావాదేవీ మొత్తం రూ.2,000 దాటినప్పటికీ చిన్న వ్యాపారులకు ఎటువంటి రుసుము వర్తించదు.
నిత్యావసర రంగాలు, సాధారణ ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని విభాగాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయం వంటి తక్కువ లాభదాయక రంగాలలో రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4శాతం లెక్కించే బదులు, స్థిరంగా కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జీని మాత్రమే నిర్ణయించారు. దీనివల్ల ఆయా రంగాల వ్యాపారాలకు చెల్లింపు ఖర్చులపై ముందస్తు స్పష్టత ఉంటుంది.
మరోవైపు మూలధన మార్కెట్ లావాదేవీలకు అతి తక్కువ రుసుమును నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్‌లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లతో జరిపే చెల్లింపులపై కేవలం 0.02 శాతం మాత్రమే ఛార్జీ వర్తిస్తుంది. అంటే ఎవరైనా రూ.10,000 విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెడితే పడే ఎండీఆర్ కేవలం రూ.2 మాత్రమే. డెబిట్ కార్డులపై సాధారణంగా 0.9శాతం వరకు, క్రెడిట్ కార్డులపై 1.5శాతం నుండి 2శాతం పైగా మర్చంట్ ఛార్జీలు ఉంటాయి. వాటితో పోలిస్తే యూపీఐపై గరిష్ట పరిమితి రూ.300కి లోబడి ఉన్న 0.4శాతం ఛార్జీ చాలా తక్కువ. కాబట్టి వినియోగదారులకు పూర్తి ఉచితంగా, వ్యాపారులకు కార్డుల కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన ఎంపికగా అక్టోబర్ 15 తర్వాత కూడా యూపీఐ అగ్రస్థానంలోనే ఉంటుంది.