UPI Payments: యూపీఐలో రూ.వెయ్యికి మించి చేసే ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీలు..? కేంద్రం క్లారిటీ ఇదిగో..

దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరుగతోంది. రికార్డ్ స్థాయిలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. బడ్డీ కొట్టు దగ్గర నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతీచోట స్కానర్లు అందుబాటులో ఉంటాయి. దీంతో వినియోగదారులు సులువుగా పేమెంట్స్ చేయగలగుతున్నారు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఓ వార్త కలకలం రేపుతోంది.

UPI Payments: యూపీఐలో రూ.వెయ్యికి మించి చేసే ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీలు..? కేంద్రం క్లారిటీ ఇదిగో..
Upi

Updated on: Feb 16, 2026 | 1:50 PM

దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫుట్‌పాత్ మీద ఉండే షాపుల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట డిజిటల్ పేమెంట్స్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు ప్రతీ ఏడాది దేశంలో పెరుగుతోంది. ఇక యూపీఐ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాక వ్యాపారులకు కస్టమర్లు నగదు చెల్లించడం సులువైంది. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెకన్ల వ్యవధిలోనే నగదు చెల్లింస్తున్నారు. ఇక వేరేవారికి నగుదు పంపించాలన్నా సరే యూపీఐ నెంబర్ ద్వారా సెకన్లలోనే పంపించే ఫెసిలిటీ వచ్చింది. యూపీఐ లావాదేవీలు కొన్ని ప్రస్తుతం ఉచితంగా చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ త్వరలో యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది.

రూ.వెయ్యి దాటితే చార్జీలు..?

రూ.వెయ్యికి మంచి చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొనగా.. కొంతమంది నిజమేనని భావిస్తున్నారు. ఈ ప్రచారంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారులు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టతిచ్చింది. ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచన ఏం లేదని, బయట జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది.

ప్రస్తుత లిమిట్ ఎంతంటే..?

ప్రస్తుతం సాధారణ వినియోగదారులు రోజుకు రూ.లక్ష వరకు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ అకౌంట్‌కు అయితే రూ.5 లక్షల వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇక ఇటీవల బడ్జెట్‌లో యూపీఐ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి కేంద్రం రూ.2 వేల కోట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ భారం పడకుండా వీటిని అందించనుంది. ఇక కరెంట్ బిల్లులు, ఇతరత్రా బిల్లులు చేయడానికి చేసే చెల్లింపులపై ప్రస్తుతం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.