
ఆధార్ కార్డుదారులకు యూఐడీఏఐ అలర్ట్ జారీ చేసింది. ఆధార్‌లోని వివరాలు తప్పుల్లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా పేరు ఇతర ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న విధంగానే ఉండేలా చూసుకోవాలి. పేరులో చిన్న తేడాలు ఉన్నా భవిష్యత్తులో ఆర్థిక, ప్రభుత్వ సేవలకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అన్ని పత్రాల్లో ఒకేలా పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌లోని పేరును జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పేరును అప్‌డేట్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. తప్పులు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని అప్‌డేట్ చేసుకోవాలి. ఆధార్‌లో పేరు మార్పులకు సంబంధించి యూఐడీఏఐ గతంలో ఒక సర్కులర్ జారీ చేసింది. పేరు మార్పుకు సంబంధించి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఖరారు చేసింది. గతంలో అక్టోబర్ 28, 2021న జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నిబంధనలను అమలు చేస్తోంది ఈ కొత్త ప్రొసీజర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ కిందకు వస్తుంది.
యూఐడీఏఐ కొత్త నిబంధనల ప్రకారం ఆధార్‌లో పేర్లను పెద్ద అక్షరాలు(CAPITAL LETTERS) మాత్రమే నమోదు చేయాలి. మారుపేర్లు, మేజర్, కెప్టెన్ లాంటి సైనిక హోదాలు, అవార్డులు లేదా ఇతర ప్రత్యేక చిహ్నాలను పేరులో చేర్చుకోవడానికి అనుమతి లేదు. మహిళలు వివాహం లేదా విడాకుల తర్వాత తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే.. అఫిడవిట్‌తో పాటు పాన్ కార్డ్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. లింగ మార్పిడి జరిగిన తర్వాత పేరు మార్చుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించాలి. వైద్య ధ్రువీకరణ పత్రాలు, ఇతర గుర్తింపు పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పేరులో ఉన్న హోదా, ర్యాంక్ లేదా అదనపు ఇంటిపేరు వంటి వాటిని తొలగించడానికి గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి. ఇక పేరు మధ్యలో ఏవైనా పెద్ద అక్షరాలు (CAPITAL LETTERS) లేదా చుక్కలు (dots) తప్పుగా పడినట్లయితే.. వాటిని సరిచేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ కొత్త నిబంధనల్లో పేర్కొంది.
ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో లేదా ఇంతకుముందు అప్‌డేట్ చేసుకున్నప్పుడు సరైన పత్రాలు అందించినప్పటికీ.. డేటా ఎంట్రీ లోపం కారణంగా ఆధార్‌లో పేరు తప్పుగా పడితే, దానిని సరిదిద్దడానికి కొన్ని పత్రాలు ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అందించాలి. ఈ కొత్త నిబంధనలు ఆధార్ సమాచారాన్ని మరింత కచ్చితంగా, ప్రామాణికంగా ఉంచడానికి ఉపయోగపడతాయని యూఐడీఏఐ పేర్కొంది.