CNG Scooter: సీఎన్‌జీ స్కూటర్ వెర్షన్‌ను ప్రకటించిన టీవీఎస్.. లాంచ్ ఎప్పుడంటే..?

భారతదేశంలో ఇటీవల కాలంలో స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాలు బైక్ కంటే స్కూటర్ కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. స్కూటర్ కొంటే ఇంట్లోని ఆడవాళ్లు కూడా వేసుకెళ్లేందుకు అనువుగా ఉండడంతో పాటు ట్రాఫిక్‌లో సౌకర్యంగా ప్రయాణించవచ్చనే తలంపుతో స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఈవీ స్కూటర్ల హవా నడుస్తున్న తరుణంలో ప్రముఖ కంపెనీ టీవీఎస్ సీఎన్‌జీ వెర్షన్‌లో స్కూటర్‌ను రిలీజ్ చేసింది.

CNG Scooter: సీఎన్‌జీ స్కూటర్ వెర్షన్‌ను ప్రకటించిన టీవీఎస్.. లాంచ్ ఎప్పుడంటే..?
Tvs Cng

Updated on: May 25, 2025 | 6:15 PM

భారతదేశంలో ప్రముఖ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్స్ భవిష్యత్‌లో సీఎన్‌జీ ఆధారిత స్కూటర్లు, బైక్‌లు లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈవీ స్కూటర్స్ రంగంలో తన హవా చూపించిన టీవీఎస్ సీఎన్‌జీ వెర్షన్‌లో స్కూటర్స్ లాంచ్ చేస్తామని ప్రకటించింది. ఈవీ స్కూటర్లు ఎంత ప్రజాదరణ పొందినా సగటు వినియోగదారుడిని చార్జింగ్ భయం వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ వెర్షన్ స్కూటర్ లాంచ్ చేసేందుకు టీవీఎస్ చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు ఇతర స్కూటర్లపై దృష్టి పెడుతూనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీ స్కూటర్ లాంచ్‌కు కూడా టీవీఎస్ చర్యలు తీసుకుంటుందని మార్కెట్ ప్రతినిదులు చెబుతున్నారు. అయితే కొత్తగా లాంచ్ చేసిన టీవీఎస్ సీఎన్‌జీ స్కూటర్ జూలై లేదా సెప్టెంబర్ 2025 నెలల్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

టీవీఎస్ సీఎన్‌జీ స్కూటర్‌ను ఆ కంపెనీ  జనవరిలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జూపిటర్ సీఎన్‌జీ కాన్సెప్ట్‌తో పేరుతో వెర్షన్‌ను ప్రదర్శించింది. జూపిటర్ 125 ఆధారంగా ఈ స్కూటర్ పెట్రోల్, సీఎన్‌జీ రెండింటిలోనూ నడపడానికి వీలు కల్పించే ద్వి-ఇంధన వ్యవస్థను కలిగి ఉంది. ఇది 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ప్రారంభిస్తామని ఆ సమయంలో పేర్కొన్నారు. జూపిటర్ సీఎన్‌జీలో 124.8 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 7.2 బీహెచ్‌పీ, 9.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ స్కూటర్ సీటు కింద 1.4 కేజీ సీఎన్‌జీ ట్యాంక్, ఫ్లోర్‌బోర్డ్‌లో 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో వస్తుంది. 

టీవీఎస్ సీఎన్‌జీ స్కూటర్ 84 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. పెట్రోల్, సీఎన్‌జీ రెండింటినీ ఉపయోగిస్తే 226 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్‌లో అధునాతన హెడ్‌ల్యాంప్ సెటప్ ఆకట్టుకుంటుంది. అలాగే అప్‌డేటెడ్ స్విచ్‌గేర్, సైడ్ స్టాండ్ అలర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు భాగంలో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, మల్టీ-ఫంక్షన్ లాక్ సిస్టమ్ ఫీచర్లు ఆకర్షిస్తున్ానయి. అయితే తుది ఉత్పత్తి వెర్షన్‌లో కొన్ని మార్పులు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి