ఏడాది క్రితం అనేక చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 5.1 బిలియన్ డాలర్ల నికర విలువతో 700వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది కూడా అంతే ఆస్తులతో 700వ స్థానంలో ఉన్నారు. అయితే పన్నెండు నెలల క్రితం ట్రంప్‌కు ఇంత సంపద లేదు. ఫోర్బ్స్ ప్రకారం, గత 12 నెలల్లో ఆయన తన సంపదను రెట్టింపు చేసుకున్నారు. 2024లో ట్రంప్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల కోసం తన ఆస్తుల నికర విలువను పెంచి చూపించారంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్ ఆస్తుల జప్తు కూడా ఆదేశించింది. అందులో ఆయన ఐకానిక్ 40 వాల్ స్ట్రీట్ భవనం కూడా ఉంది. దీంతో ట్రంప్ ఆర్థిక భవిష్యత్తు అనిశ్చితంగా అనిపించింది. కానీ ట్రంప్ ప్రతిఘటించారు.
ఆస్తుల జప్తును నివారించడానికి అవసరమైన బాండ్ మొత్తాన్ని 454 మిలియన్ డాలర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు తగ్గించే విధంగా అతని న్యాయ బృందం కోర్టును ఒప్పించింది. తద్వారా పరిస్థితులను మార్చుకోవడానికి ట్రంప్‌కు సమయం దొరికింది. వెంటనే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ట్రూత్ సోషల్ మాతృ సంస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గణనీయమైన నష్టాలు ఉన్నప్పటికీ, పేర్ విలువ పెరిగింది. స్టాక్ 72 శాతం క్షీణించినప్పటికీ, మార్చి 2025 నాటికి ట్రంప్ ఇప్పటికీ 2.6 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉన్నారు. ఇది ఆయన సంపద పెరుగుదలకు దోహదపడింది. అలాగే 2024 అక్టోబర్‌లో ట్రంప్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది అనుభవం లేని పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుంది. ప్రారంభంలో అస్పష్టంగా ఉన్నప్పటికీ, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల విజయం తర్వాత క్రిప్టో వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ నుండి వచ్చిన హైప్‌తో ఈ ప్రాజెక్ట్ విలువ పెరిగింది.
ఈ వెంచర్ చివరికి ట్రంప్ సంపదకు 245 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని జోడించింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. డిజిటల్ టోకెన్ $TRUMPని ఆయన ఆవిష్కరించారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. 350 మిలియన్ డాలర్లు ఆర్జించింది. 2024 చివరి నాటికి, ట్రంప్ క్రిప్టోకరెన్సీ వెంచర్లు అతనికి దాదాపు 800 మిలియన్ డాలర్ల ఆదాయం అందిచినట్లు అంచనా. దీనితో ట్రంప్ క్రిప్టో కింగ్‌గా మారారు. ఇలా ట్రంప్ తన వ్యాపార తెలివి తేటలతో ఏడాదిలో తన సంపదను రెట్టింపు చేసుకున్నారు. ఫోర్బ్స్ 2025 బిలియనీర్ల జాబితాలో రికార్డు స్థాయిలో 3,028 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం నికర విలువ 16.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఆయన సన్నిహిత సలహాదారు ఎలోన్ మస్క్ తో పోలిస్తే ట్రంప్ సంపద ఇప్పటికీ చాలా తక్కువ. 342 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.