UPI transactions: యూపీఐ ద్వారా సెకనుకు అన్ని లావాదేవీలా..? ఆ దేశాలను మించిపోయిన భారత్

|

Oct 26, 2024 | 4:15 PM

దేశంలో సాంకేతిక ప్రగతి పరుగులు పెడుతోంది. దీని ద్వారా వివిధ పనులను చాలా సులభంగా చేసుకునే వీలు కలిగింది. కాలయాపన లేకుండా తక్కువ సమయంలో అనేక పనులు జరుగుతున్నాయి. వీటిలో డిజిటల్ లావాదేవీల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. గతంలో ఏ అవసరమెచ్చినా నగదును తీసుకువెళ్లాల్సి వచ్చేది. బిల్లులు కట్టాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా చాలా పెద్ద పనిలా ఉండేది. ఆ పనుల కోసం రోజు మొత్తం కేటాయించాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

UPI transactions: యూపీఐ ద్వారా సెకనుకు అన్ని లావాదేవీలా..? ఆ దేశాలను మించిపోయిన భారత్
Upi Transactions
Follow us on

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)తో చాలా సులభంగా ఇంటిలో కూర్చుని అన్ని ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు. దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడంలో యూపీఐ కీలకపాత్ర పోషిస్తోంది. యూపీఐ అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. స్మార్ట్ ఫోన్ల లోని యాప్ ల ద్వారా వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. దీన్ని 2016 ఏప్రిల్ 11న దేశంలో ప్రారంభించారు. అప్పటి నుంచి నెమ్మదిగా పెరిగిన యూపీఐ వినియోగం కరోనా సమయంలో ఊపందుకుంది. దేశంలో జరిగే డిజిటల్ చెల్లింపులకు చాలా కీలకంగా మారింది. కోట్ల మంది ప్రజలు యూపీఐని వినియోగించి నిత్యం లావాదేవీలు జరుపుతున్నారు.

దేశంలో అనేక ఆన్ లైన్ చెల్లింపు వ్యవస్థలు ఉన్నా యూపీఐ ద్వారానే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. 2018లో దీని వాటా కేవలం 4.4 శాతం ఉండేది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ 2024 నాటికి 70 శాతానికి చేరుకుంది. డిజిటల్ లావాదేవీల విషయంలో మన దేశం బ్రిక్స్ లోని మిగిలిన దేశాలను అధిగమించింది. 2024లో మన దేశంలో జరిగిన డిజిటల్ లావాదేవీల విలువ చైనా, బ్రెజిల్ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. డిజిటల్ లావాదేవీల విషయంలో మన యూపీఐ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2023లో యూపీఐ ద్వారా సెకనుకు 3,729 చెల్లింపులు జరిగాయి. ఇక ప్రపంచంలో వందకు పైగా దేశాల్లో అమలవుతున్న స్క్రీల్ ద్వారా సెకనుకు 1,554 చెల్లింపులు నమోదయ్యాయి. బ్రెజిల్ లో కొనసాగుతున్న ఫిక్స్ ద్వారా సెకనుకు 1,332 చెల్లింపులు జరిగాయి. చైనాలోని ఎయిర్ పే ద్వారా 2023లో 1,157 మిలియన్ల లావాదేవీలు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్ల నుంచి 2023-24 నాటికి 18,737 కోట్లకు చేరాయి. ఏటా దాదాపు 44 శాతం పెరుగుతూ పోతున్నట్టు నివేదికలు చెబుతున్నారు. మన దేశంలోనే కాకుండా దుబాయ్, ఖతార్, కువైట్, మారిషస్ దేశాల్లో యూపీఐ సేవలను ఎన్పీసీఐ అందజేస్తోంది. తద్వారా అంతర్జాతీయంగా కూడా యూపీఐ విస్తరిస్తోంది. అలాగే ఫిజికల్ గా డబ్బులు ఉంచుకోవడం కన్నా డిజిటల్ లావాదేవీలు చేయడమే మంచిదని ప్రజలు కూడా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి