ప్రజలకు జీవనోపాధిని కల్పించి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వ్యక్తుల ఆదాయం పెరిగితే వారి కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం మెరుగుపడుతుంది. దాని నుంచి దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. అవి క్షేత్రస్థాయిలో అర్హులకు అందినప్పుడే ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా ఒక వ్యక్తి వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుని జీవితంలో గెలిచాడు. నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు.
బీహార్‌లోని వైశాలి జిల్లాలోని కతేర్మలా గ్రామానికి చెందిన దేవేంద్ర షా దాదాపు పదిహేనేళ్ల పాటు పాట్నా టెలిఫోన్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే అతడిని అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారు. బతకడానికి వేరే ఆధారం లేకపోవడంతో దేవేంద్ర షా తన స్వ గ్రామానికి తిరిగి వచ్చేశాడు.
దేవేంద్ర షా తన గ్రామంలో వ్యవసాయం పనులు ప్రారంభించాడు. పంటలను సాగు చేయడం మొదలు పెట్టాడు. దానిలో పాటు ఆ గ్రామంలో పాలను కొనుగోలు చేసి నగరంలో విక్రయించే వ్యాపారం కూడా చేశాడు. కానీ అతడికి అవి కలిసి రాలేదు. వ్యాపారంలో విపరీతంగా నష్టం వచ్చింది. ఎంత కష్టబడినా ఆదాయం రాకపోడంతో దేవేంద్ర షాకు ఏమి చేయాలో తెలియలేదు. అప్పుడు ఒక స్నేహితుడు అతడికి పాల ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించమని సలహా ఇచ్చాడు. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో చిన్న గదిలోనే ఆ వ్యాపారం కూడా ప్రారంభించాడు.
దేవేంద్ర షా దగ్గర పాలు పోయించుకునే ఖాతాదారులలో ఒక బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నాడు. వ్యాపారంలో పెట్టుబడికి ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) అనే పథకం ఉందని, దానిని ప్రయత్నించాలని అతడు సలహా ఇచ్చాడు. దీంతో దేవేంద్ర షా ఆ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పథకంలో రుణంగా లభించిన రూ.పది లక్షలతో తన వ్యాపారాన్ని బాగా విస్తరించాడు.
2021 నాటికి అతడి వ్యాపారం బాగా పెరిగింది. అతను ముజఫర్‌పూర్, మోతీపూర్, వైశాలి వంటి ప్రాంతాలకు పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రారంభించాడు. వ్యాపారం బాగా పెరగడంతో మరో ఆరుగురికి ఉద్యోగాలు ఇచ్చాడు.
దేవేంద్ర షా దగ్గర నాణ్యమైన పాల ఉత్పత్తులు లభిస్తుండడంతో ప్రజల ఆదరణ పెరిగింది. ఇతడి దగ్గర పెరుగు చాలా రుచిగా ఉండడంతో కొనుగోలు దారులు పెరిగారు. నాణ్యతను బట్టి లీటర్ ను రూ.60, రూ. 65 రూ. 75 ధరలకు విక్రయిస్తున్నాడు. అలాగే రూ.8, రూ.10, రూ.15 ధరలలో స్వీట్లు కూడా అమ్ముతున్నాడు. దేవేంద్ర షా ఇప్పుడు నెలకు రూ.80 వేల వరకూ సంపాదిస్తున్నాడు.
ఏ పని చేయాలో తెలియక సాగు చేపట్టి, పాల వ్యాపారం ప్రారంభించిన దేవేంద్ర షా నష్టాల బారిన పడ్డాడు. అతడిని ప్రధానమంత్రి ముద్ర యోజన ఆదుకుంది. శ్రమ, పట్టుదలతో వ్యాపారం చేస్తున్న అతడు రుణంగా లభించిన డబ్బులతో వ్యాపారాన్ని విస్తరించి విజయం సాధించాడు. లాభాలను ఆర్జిస్తూ మరో ఆరుగురి ఉపాధి కూడా కల్పించే స్థాయికి ఎదిగాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..