FD Rates: మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి పెంచింది. ఈ రోజు మరో 50 బేసిస్ పాయింట్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు ప్రకటన తర్వాత.. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మొదలైన అనేక ప్రైవేట్ బ్యాంకులు ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. చిన్న ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇప్పుడు ఏడాది కాలపరిమితి ఉండే FDలపై 6.25 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత కారణంగా.. చాలా మంది రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితమైన పెట్టుబడి నిర్ణయంగా పరిగణిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లిక్విడిటీ లభిస్తుంది. ఇది అత్యవసర కార్పస్‌ను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం FDలపై ఉత్తమ వడ్డీని అందించే బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
RBL బ్యాంక్ ఒక సంవత్సరం FDలపై 6.25 శాతం వడ్డీని అందిస్తుంది. IndusInd బ్యాంక్ ఏడాది కాలపరిమితి ఉండే FDలపై 6 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదే సమయంలో బంధన్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఏడాది FDలపై 5.75 శాతం వడ్డీని అందిస్తున్నాయి. DCB బ్యాంక్ 5.55 శాతం వడ్డీని చెల్లింస్తుండగా.. ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులు మాత్రం 5.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
చిన్న ప్రైవేట్ బ్యాంకులు కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) రూ. 5 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులకు హామీ ఇస్తోంది. పైన తెలిపిన వివరాలు కోటి రూపాయలకంటే తక్కువ డిపాజిట్ చేసే నాన్-సీనియర్ సిటిజన్లకు ఈ రేట్లను సదరు బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి.