Best range electric cars: మైలేజ్ విషయంలో ఈ ఈవీ కార్లే కింగ్.. 400 కిలోమీటర్లకు పైగా రేంజ్

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు టాప్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. సంప్రదాయ పెట్రోలు, డీజిల్ వాహనాలకు బదులుగా వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి. ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయ డిజైన్ తో ఇవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

Best range electric cars: మైలేజ్ విషయంలో ఈ ఈవీ కార్లే కింగ్.. 400 కిలోమీటర్లకు పైగా రేంజ్
Ev Cars

Updated on: May 11, 2025 | 7:15 PM

ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అనేక విషయాలను పరిశీలిస్తారు. వాటిలో రేంజ్ అతి ముఖ్యమైంది. అధిక రేంజ్ ఇచ్చే కార్లలో దూర ప్రాంతాలకు చక్కగా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణం ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో దాదాపు 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే మోడళ్ల వివరాలు, వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం. ఉదాహరణకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు మధ్య దూరం సుమారు 430 కిలోమీటర్లు. సింగిల్ చార్జింగ్ తో ఈ కార్లలో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో హైదరాబాద్ వెళ్లపోవచ్చు.

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో

అధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఒకటి. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 449 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. దీనిలో అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.17.49 లక్షలు కాగా.. బ్యాటరీ సేవగా కొనుగోలు చేస్తే రూ.12.50 లక్షలకే అందుబాటులోకి వస్తుంది.

టాటా కర్వ్

టాటా కంపెనీ నుంచి అనేక ఎలక్ట్రిక్ కార్లు విడుదల అయ్యాయి. వాటిలో టాటా కర్వ్ చాలా ముఖ్యమైంది. ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. మంచి రేంజ్ కోరుకునే వారికి తిరుగులేని ఎంపిక అని చెప్పవచ్చు. ఈ కారు రూ.17.49 లక్షల నుంచి రూ.22.24 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

ఎంజీ జెడ్ఎస్

అధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ జీఎస్ ఈవీ ఒకటి. సింగిల్ చార్జింగ్ పై సుమారు 461 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. పైగా ఇది ఐదు సీట్ల కారు కావడం మరింత విశేషం. రూ.18.98 లక్షల నుంచి రూ.26.64 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు ఈ కారు లభిస్తుంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఈవీ కూడా మెరుగైన రేంజ్ ఇచ్చే కార్లలో ముందుంటుంది. సింగిల్ చార్జింగ్ పై దాదాపు 489 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.12.49 లక్షలు, అయితే టాప్ వేరియంట్ కోసం రూ.17.19 లక్షలు ఖర్చు చేయాలి.

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ కంపెనీ ఈ ఏడాది జనవరిలో తన ఎలక్ట్రిక్ కారు క్రెటాను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారు సింగిల్ చార్జింగ్ పై సుమారు 473 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.17.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ.24.38 లక్షలకు అందుబాటులో ఉంది.

టాటా పంచ్

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రజల ఆదరణ పొందింది. సామాన్యులు కొనగలిగే ధరలో దీన్ని తీసుకువచ్చారు. సింగిల్ చార్జింగ్ పై సుమారు 421 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు కాగా, టాప్ వేరియట్ రూ.14.44 లక్షలకు అందుబాటులో ఉంది.

మహీంద్రా ఎక్స్ యూవీ 400

మహీంద్రా నుంచి విడుదలైన ఎక్స్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారు మంచి రేంజ్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఐదు సీట్ల కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 456 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ కారు నుంచి రూ.16.74 లక్షల నుంచి రూ.17.69 లక్షల ధరకు కొనుగోలు చేయవచ్చు.