
వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎండ నుంచి ఉపశమనం కోసం ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండ సమయంలో బయటకు రావడం లేదు. చల్లదనాన్నిచ్చే పానీయాలు తీసుకుంటున్నారు. మనుషుల వరకూ సరే, మరి పంటల పరిస్థితి ఏమిటి. విపరీతమైన ఎండల కారణంగా పంటలు పాడైపోతాయి. వాటికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండుముఖం పడతాయి. ఈ సమయంలో వాటిని కూడా జాగ్తత్తగా చూసుకోవడం చాలా అవసరం.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేసవి కాలంలో పలు రాష్ట్రాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరుతో పాటు మే నెలలో ఇవి తీవ్రంగా ఉంటాయి. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, తెలంగాణతో సహా పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. వేడి గాలుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండడంతో పాటు రైతులు పంటలను రక్షించుకోవాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
నీటి నిర్వహణ.. వేసవి నెలల్లో సమర్థవంతమైన నీటి నిర్వహణ చాలా ముఖ్యం. ముఖ్యంగా బిందు సేద్యం ద్వారా మట్టిలో తేమ పోకుండా చూసుకోవాలి. చల్లటి సమయంలో పొలాలకు నీరు పెట్టడం వల్ల నీటి నష్టాన్ని నివారించవచ్చు.
మల్చింగ్.. గడ్డి, ఎండుగడ్డి, కంపోస్ట్ తదితర వాటిని పంటల చుట్టూ నేల ఉపరితలంపై వేయాలి. ఈ మల్చింగ్ విధానం వల్ల నేలలో తేమ నిలుస్తుంది. కలుపు మొక్కల పెరుగుదలను అణిచివేస్తుంది. తద్వారా మొక్కలకు నీటి అవసరాన్ని తగ్గించి, ఆరోగ్యకర పెరుగుదలకు తోడ్పడుతుంది.
పంట మార్పిడి.. నేల క్షీణత, తెగుళ్లు, వ్యాధులను తగ్గించేందుకు పంట మార్పిడి విధానం చాలా ఉపయోగపడుతుంది. ఒకే పంట కాకుండా వివిధ రకాలను సాగు చేయడం వల్ల నేర సారం బాగుంటుంది. భూసారం మెరుగుపరచడానికి లోతుగా పాతుకుపోయిన రకాలతో పంటలను సాగు చేయండి.
షేడ్ నెట్టింగ్.. అధిక ఎండ, వేడి నుంచి పంటలను కాపాడటానికి షేడ్ నెట్టింగ్‌ను అమర్చండి. ఇది ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. ట్రాన్స్‌పిరేషన్ ద్వారా నీటి నష్టాన్ని తగ్గిస్తుంది. మొక్కల పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం).. తెగుళ్ల ను సమర్థవంతంగా నివారించడానికి ఐపీఎం వ్యూహాలను అమలు చేయండి. పొలాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. జీవ నియంత్రణ పద్ధతులను ఆచరించాలి.
నేల ఆరోగ్యం.. కంపోస్ట్, పేడ వంటి సేంద్రియ పదార్థాలను మట్టిలో కలపడం ద్వారా భూసారం మెరుగవుతుంది. ఇలాంటి నేలల్లో తేమశాతం బాగుంటుంది. పంటను కాపాడటానికి దోహదం చేసే ప్రయోజనకరమైన సూక్ష్మ జీవులకు మద్దతు ఇస్తాయి.
సకాలంలో కోతలు.. దిగుబడి, నాణ్యతను పెంచడానికి పంటలను నిర్ణీత కాలంలో పండించండి. ఆలస్యంగా కోయడం వల్ల పంటలు అధిక వేడి ఒత్తిడికి గురవుతాయి. తెగుళ్లు, వ్యాధుల బారిన పడతాయి. ఇలాంటి నష్టాలను తగ్గించడానికి, పంట నాణ్యతను కాపాడుకోవడానికి సరైన పంట నిర్వహణ పద్ధతులను పాటించాలి.
రకరకాల ఎంపిక.. వేడి, పొడి పరిస్థితులకు బాగా సరిపోయే పంట రకాలను ఎంచుకోండి. మీ ప్రాంతంలోని వాతావరణ సవాళ్లకు అనుగుణంగా వేడిని తట్టుకునే వాటిని సాగు చేయాలి. తద్వారా ఎండ కారణంగా కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు.
రక్షణ కవచాలు.. విపరీతమైన ఉష్ణోగ్రత, గాలి, తెగుళ్ల నుంచి చిన్న మొక్కలను రక్షించుకోవడానికి రోకవర్స్, పంట షెల్టర్ వంటి రక్షణ కవచాలను ఉపయోగించాలి. పర్యావరణ ఒత్తిళ్లకు వ్యతిరేకంగా భౌతిక రక్షణను అందిస్తూ మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని ఈ కవచాలు సృష్టిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..