
రూల్స్ పాటించని రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TS RERA) చర్యలు చేపట్టింది. రియల్ ఎస్టేట్ నిబంధనలను ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై కొరడా ఝుళిపించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే దిశగా పలు సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, కొనుగోలుదారులకు చెల్లించాల్సిన నగదును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రెరా రూ.25 లక్షల జరిమానా విధించింది. మంచిరేవులలోని సనాలి ది ఎడ్జ్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రకటనలు, బుకింగ్‌లు, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. రెరా రిజిస్ట్రేషన్ పొందే వరకు ఎలాంటి విక్రయ కార్యకలాపాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.
పలు సంస్థలకు డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశాలు
కొనుగోలుదారులకు నగదు తిరిగి చెల్లించే విషయంలోనూ రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ కొనుగోలుదారుకు రూ.17 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ.41.85 లక్షలు, వాసవి రియల్టర్స్ సంస్థ రూ.49.50 లక్షలను 10.85 శాతం వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్ సంస్థ రూ.27.16 లక్షలు, బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
మియాపూర్‌లోని అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను తక్షణమే కొనుగోలుదారుకు అప్పగించాలని రెరా ఆదేశించింది. ఈ విషయంలో రూ.6.58 లక్షల బకాయిలకు సంబంధించి అరైన్ ఇన్‌ఫ్రా చేసిన వాదనను తిరస్కరించింది. మరోవైపు భువంతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ కొనుగోలుదారులకు రూ.26 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
ఆదేశాలు అమలు చేయకపోతే అదనపు జరిమానాలు
రెరా జారీ చేసిన ఈ ఆదేశాలను సంబంధిత నిర్మాణ సంస్థలు తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో రెరా చట్టంలోని సెక్షన్ 63 కింద అదనపు జరిమానాలు విధిస్తామని తెలంగాణ రెరా హెచ్చరించింది. కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.