Air India: టాటా గ్రూప్ కిందకు వెళ్లిన వెంటనే ఎయిర్ ఇండియాలో చాలా మార్పులు మొదలయ్యాయి. ఈ తరుణంలో టాటా గ్రూప్ ఇప్పుడు మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా పక్కన పడి ఉన్న కంపెనీ విమానాలను కూడా ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. ఎయిర్ ఇండియా కొత్త యజమాని అయిన టాటా.. ఎయిర్‌పోర్టు హ్యాంగర్‌లో పార్క్ చేసిన విమానాలను సరిచేసి సర్వీసులో పెట్టాలని భావించింది. ఇందుకోసం కంపెనీ పనులు షురూ చేసింది. ఇది విమాన ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీకి సహాయపడనుందని తెలుస్తోంది. ఇంజిన్‌లను సరిచేయకపోవడం లేదా విడిభాగాలు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాల వల్ల ఇవి మూలనపడ్డాయి.
చాలా ఎయిర్ ఇండియా విమానాలు మూతపడ్డాయి:
ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సేవలను అందిస్తున్న ప్రముఖ సంస్థ. అటువంటి పరిస్థితిలో.. సంస్థ మూలనపడి ఉన్న తన విమానాలను తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పునరుద్ధరించిన తర్వాత కంపెనీ సేవలు మరింత మెరుగుపరచవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం.. కంపెనీకి దాదాపు 25 నారో బాడీ A320 విమానాలు ఉన్నాయి. అవి సేవలో లేవు. అదే సమయంలో.. అనేక బోయింగ్ 777, 787 విమానాలు కూడా ఇలాగే వినియోగంలో లేవు. ప్రస్తుతం.. ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ హ్యాంగర్‌లలో 8 నుంచి 10.. A320 విమానాలు సర్వీస్ చేయబడ్డాయి. రాబోయే 3 నెలల్లో అనేక బోయింగ్ 787 విమానాలను తిరిగి సేవల్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
అప్పుల భారంతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియా యాజమాన్యం తాజాగా టాటా గ్రూపునకు చేరింది. గతేడాది అక్టోబర్‌లో టాటా గ్రూప్ రూ.18,000 కోట్లకు బిడ్ వేయగా.. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించింది. JRD టాటా ఈ కంపెనీని 1932లో ప్రారంభించాపు. ఇప్పుడు 69 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్ చెంతకు చేరుకుంది.