ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వాలు ఊతమివ్వడం, ప్రజలు కూడా ఇ-వెహికిల్స్ వాడడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ రంగం శరవేగంగా దూసుకెళ్తోంది. దీంతో బడా ఆటో మొబైల్ సంస్థలు సైతం ఇ-వెహికిల్స్‌ను తయారు చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన వాహనాలు రూపొందిస్తున్నారు.
ఇక ఎలక్ట్రిక్ కార్ల తయారీలోనూ సమూల మార్పులు వచ్చాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీ కార్లను సైతం రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తోంది. బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫారమ్ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. టాటా అవిన్య పేరుతో ఈ కారును రూపొందిస్తున్నట్లు టాటా అధికారికంగా ప్రకటించింది.
టాటా అనుబంధ సంస్థలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా ప్యాసింజర్ ఎలకట్రిక్ మొబిలిటీ ఈ కారును రూపొందిస్తున్నాయి. ఈ ప్రీమియం కారు తయారీ కోసం ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్, బ్యాటరీ ప్యాక్, తయారీ పరిజ్ఞానంతో కూడిన రాయల్టీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. టాటా మొటార్స్ తొలిసారిగా అవిన్య కాన్సెప్ట్‌ను 2022లో ప్రదర్శించింది. 2025 నాటికి మార్కెట్‌లో ఈ కారును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన టెక్నాలజీని అందంచనున్నారు. ‘అవిన్య ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని. ఈ కారును మార్కెట్లోకి తీసుకొచేందుకు జేఎల్‌ఆర్, ఈఎమ్‌ఏ ప్లాట్‌ఫామ్‌లు తమకు సహకరించడం చాలా సంతోషంగా ఉందని.. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆనంద్ కులకర్ణి అన్నారు.
ఇక ఈ కారు డిజైన్ విషయానికొస్తే.. అద్భుతంగా డిజైన్ చేశార. అత్యాధునిక ఫీచర్లతో, హైఎండ్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. ఈ కారులో సైడ్ మిర్రర్‌లు ఉండవు, బయటి వ్యూన్ నేరుగా కారు డిస్‌ప్లేలోనే చూసుకోవచ్చు. కారు వెనక ‘T’ డిజైన్‌లో టెయిల్స్ ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా రూ. 500 నుంచి రూ. 700 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఎస్‌యూవీని పోలిన విధంగా ఈ కారు పూర్తి స్థాయిలో వాయిస్ కంట్రోల్‌తో పని చేస్తుంది. కారు స్టీరింగ్‌ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ధర, పూర్తి స్థాయి ఫీచర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..