SBI Business Loan: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. రుణాలకు సంబంధించిన కొత్త కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా రుణాలు అందించేందుకు ఆరోగ్యమ్ లోన్ అనే పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. ఇది కొత్త బిజినెస్ లోన్ స్కీమ్. ఇందులో భాగంగా హెల్త్ కేర్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ కొత్త స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. క్యాష్ క్రెడిట్, టర్మ్ లోన్, బ్యాంక్ గ్యారంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటి వాటి రూపంలో ఈ కొత్త బిజినెస్ లోన్ పొందొచ్చని వెల్లడించింది.
ఆస్పత్రి, నర్సింగ్‌హోమ్స్, డయగ్నోస్టిక్ సెంటర్లు, పాథాలని ల్యాబ్స్, మ్యనుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, ఇంపోర్టర్స్, హెల్త్ కేర్ సప్లై లాజిస్టిక్ సంస్థలు వంటివి రూ.100 కోట్ల వరకు రుణం పొందవచ్చని తెలిపింది. అయితే తీసుకున్న రుణాన్ని పదేళ్ల లోపు మళ్లీ తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
కాగా, రూ.2 కోట్ల వరకు రుణం పొందాలనుకుంటే సదరు కస్టమర్ ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలం నుంచి హెల్త్ కేర్ రంగం దేశానికి దన్నుగా నిలుస్తోందని, అందుకే ఈ రంగానికి సులభంగానే రుణాలు అందించేందుకు ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఎస్‌బీఐ తెలిపింది. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను ప్రవేశపెట్టి సులభమైన రుణాలను అందిస్తోంది. సామాన్యుడి నుంచి వ్యాపారవేత్తల వరకు చాలా రకాల రుణాలు అందిస్తోంది. కోవిడ్‌ను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి రుణాలు అందిస్తోంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రుణాలతో పాటు తన సర్వీసులను కూడా సులభతరం చేసింది.