Business Idea: LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? పూర్తి వివరాలు

LPG గ్యాస్ ఏజెన్సీ వ్యాపారం యువ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన అవకాశం. స్థిరమైన డిమాండ్, దీర్ఘకాలిక ఆదాయం దీని ప్రత్యేకతలు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వ నిబంధనలు, పెట్టుబడి (గ్రామీణంలో రూ.10-15 లక్షలు, పట్టణంలో రూ.25-50 లక్షలు), భద్రతా ప్రమాణాలపై అవగాహన ముఖ్యం.

Business Idea: LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? పూర్తి వివరాలు
Lpg Gas Agency

Updated on: May 16, 2026 | 10:00 AM

LPG గ్యాస్‌ ఏజెన్సీ వ్యాపారం యువ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. స్థిరమైన డిమాండ్‌, దీర్ఘకాలిక ఆదాయం అవకాశాల కారణంగా చాలామంది ఈ వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే LPG డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ ప్రారంభించాలంటే ప్రభుత్వ నిబంధనలు, పెట్టుబడి, భద్రతా ప్రమాణాలపై స్పష్టమైన అవగాహన అవసరమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం వంటి ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమయానుసారం LPG గ్యాస్ ఏజెన్సీల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.

దరఖాస్తుదారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సాధారణంగా 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాన్ని బట్టి భూమి, గోదాం స్థలం, కార్యాలయ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. పెట్టుబడి విషయానికి వస్తే, ప్రాంతాన్ని బట్టి ప్రారంభ వ్యయం మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి LPG ఏజెన్సీ ప్రారంభించడానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అవసరం కావచ్చు. పట్టణ ప్రాంతాల్లో అయితే గోదాం, ట్రాన్స్‌పోర్ట్‌, భద్రతా పరికరాలు, సిబ్బంది ఖర్చులు కలిపి రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

లాభాల పరంగా చూస్తే, ప్రతి గ్యాస్ సిలిండర్‌పై కంపెనీలు డీలర్లకు నిర్ణీత కమిషన్ ఇస్తాయి. నెలకు వేల సంఖ్యలో సిలిండర్ల సరఫరా జరిగే ప్రాంతాల్లో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అదనంగా కొత్త కనెక్షన్లు, స్టౌవ్‌లు, రెగ్యులేటర్లు, కమర్షియల్ సిలిండర్ల విక్రయాల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. అయితే ఈ వ్యాపారంలో సవాళ్లు కూడా ఉన్నాయి. భారీ ప్రారంభ పెట్టుబడి, కఠిన భద్రతా నిబంధనలు, గోదాం అనుమతులు, అగ్నిమాపక శాఖ క్లియరెన్స్ వంటి అంశాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలాగే గ్యాస్ సరఫరా ఆలస్యం, రవాణా ఖర్చులు, పోటీ వంటి అంశాలు లాభాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన ప్రాంతం ఎంపిక చేసి, వినియోగదారులకు వేగవంతమైన సేవ అందిస్తే LPG గ్యాస్ ఏజెన్సీ దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారంగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us