25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో రైతన్నకు అదిరే లాభాలు..

తక్కువ పెట్టుబడి.. స్వల్ప కాలంలోనే చేతికొచ్చే పంట.. నిత్యం కాసుల వర్షం కురిపించే మార్కెట్.. ఆకుకూరల సాగులో అన్నదాతలకు కామధేనువుగా మారిన పాలకూరను ప్రకృతి పద్ధతుల్లో పండిస్తే అదిరే లాభాలు అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నేలలకు అనుగుణంగా సహజ పద్ధతులను పాటిస్తూ నిరంతర ఆదాయాన్ని ఎలా పొందాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో రైతన్నకు అదిరే లాభాలు..
Spinach Farming Tips

Updated on: Oct 05, 2026 | 4:29 PM

తెలుగు రాష్ట్రాల్లో తక్కువ పెట్టుబడితో, స్వల్ప కాలంలోనే స్థిరమైన రోజువారీ ఆదాయాన్ని అందించే పంటల్లో పాలకూర ప్రధానమైనదని చెప్పొచ్చు. పట్టణాల్లో ఆకుకూరలకు నిరంతరం డిమాండ్ ఉండటంతో రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా ప్రకృతి సేద్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నేలలకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాటించాల్సిన ముఖ్యమైన మెలకువలు రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.

మడుల తయారీ – పోషకాల యాజమాన్యం

నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు, తేలికపాటి గరప నేలలు పాలకూర సాగుకు అత్యంత అనుకూలం. అధిక వర్షాలు పడే సమయంలో తప్ప ఏడాది పొడవునా దీనిని సాగు చేయవచ్చు. భూమిని మెత్తగా దున్నిన తర్వాత 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో చిన్న చిన్న మడులను సిద్ధం చేసుకోవాలి. ఒక్కో మడికి దాదాపు 10 కిలోల చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు వేసి చదును చేయాలి. నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచేందుకు కిలో ఘనజీవామృతాన్ని లేదా లీటరు ద్రవజీవామృతాన్ని నీటితో కలిపి మడులపై చల్లుకోవడం మంచిది.

విత్తనం – నీటి నిర్వహణ

మొలక శాతం: నాణ్యమైన విత్తనాలను సమదూరంలో చల్లుకోవాలి. విత్తిన 3 నుండి 4 రోజుల్లోనే మొలకలు వస్తాయి.

నీటి తడులు: నేలలోని తేమను బట్టి తుంపర పద్ధతిలో లేదా కాల్వల ద్వారా తేలికపాటి తడులు ఇవ్వాలి. ప్రతి తడి సమయంలో 500 మిల్లీలీటర్ల ద్రవ జీవామృతాన్ని నీటితో కలిపి అందిస్తే ఆకులు ఏపుగా, పచ్చగా పెరుగుతాయి.

కలుపు నివారణ: పంట ప్రారంభ దశలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి.

కోత విధానం – పంట మార్పిడి ప్రణాళిక

విత్తిన 25 నుంచి 30 రోజుల్లో పాలకూర మొదటి కోతకు వస్తుంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి వేర్లతో సహా పీకి కట్టలు కట్టవచ్చు, లేదా కొమ్మలను కత్తిరిస్తూ బహుళ కోతల విధానాన్ని పాటించవచ్చు. 15 నుంచి 20 రోజుల వ్యవధిలో విడతల వారీగా వివిధ మడుల్లో విత్తుకోవడం వల్ల రైతులకు నిత్యం మార్కెట్‌కు పంపేందుకు సరుకు అందుబాటులో ఉండి, నిరంతర నగదు రాబడి సమకూరుతుంది. ఒక విడత పూర్తయిన తర్వాత మడిని దున్ని 10-15 రోజులు ఎండబెట్టి, తిరిగి ఎరువు వేసి తదుపరి పంట వేయాలి.

సహజ తెగుళ్ల నివారణ

కీటకాల నియంత్రణ: పొలం గట్ల వెంబడి లేదా అంతర పంటగా బంతి, తులసి వంటి మొక్కలు నాటడం వల్ల రసం పీల్చే పురుగుల బెడద తగ్గుతుంది.

అగ్ని అస్త్రం పిచికారీ: పురుగు లేదా తెగులు లక్షణాలు కనిపిస్తే రసాయనాలు వాడకుండా వేప నూనె లేదా దేశీ ఆవు మూత్రం, పొగాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లితో తయారుచేసిన అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి.

జీవామృతం తయారీ: 200 లీటర్ల నీటిలో 10 కిలోల దేశీ ఆవు పేడ, 10 లీటర్ల గోమూత్రం, 1 కిలో బెల్లం, 1 కిలో శనగ లేదా కందిపిండి, గుప్పెడు పొలం మట్టి వేసి బాగా కలిపి, నీడలో రెండు రోజులు పులియబెట్టి వాడుకుంటే పంట ఏపుగా పెరుగుతుంది.

సరైన ప్రణాళిక, సహజ ఎరువుల వాడకంతో తక్కువ విస్తీర్ణంలోనే పాలకూర సాగు చేసి తెలుగు రైతులు అధిక లాభాలు గడించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us