General Public Alert: ఈ నష్టం తిరిగి ప్రజలే భరించాల్సి ఉంటుంది.. రాళ్ల దాడులపై స్పందించిన ఇండియన్‌ రైల్వే..

ఇటీవల వందే భారత్‌ రైళ్లపై వరుసగా రాళ్ల దాడి జరగిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ - విశాఖల మధ్య నడిచే రైలుపై వరుసగా దాడులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు రైళ్లపై దాడికి దిగినట్లు అధికారులు గుర్తించారు.ఈ దాడుల్లో బోగి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. అయితే దీనిపై..

General Public Alert: ఈ నష్టం తిరిగి ప్రజలే భరించాల్సి ఉంటుంది.. రాళ్ల దాడులపై స్పందించిన ఇండియన్‌ రైల్వే..
Indian Railways

Updated on: Feb 14, 2023 | 1:50 PM

ఇటీవల వందే భారత్‌ రైళ్లపై వరుసగా రాళ్ల దాడి జరగిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ – విశాఖల మధ్య నడిచే రైలుపై వరుసగా దాడులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు రైళ్లపై దాడికి దిగినట్లు అధికారులు గుర్తించారు.ఈ దాడుల్లో బోగి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. అయితే దీనిపై తొలిసారి భారతీయ రైల్వే అధికారికంగా స్పందించింది. రైళ్లపై జరుగుతోన్న దాడుల వల్ల కలిగే నష్టాన్ని ప్రజలే భరించాల్సి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే పీఆర్‌ఓ సిహెచ్‌ రాకేష్‌ లేఖను విడుదల చేశారు.

జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని, ప్రజా ఆస్తిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో భారతీయ రైల్వేలు ఒకటని, భారత దేశ ప్రజలకు 160 సంవత్సరాల నుంచి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

దేశంలో కోవిడ్-19 మహమ్మారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సమయంలో దేశమంతా లాక్‌డౌన్ బరిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కుడా భారతీయ రైల్వే సేవాదృక్పథంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా రైలు సేవలను 24 గంటలూ నడిపిందన్నారు. అయితే ఇటీవల కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు విచ్చలవిడిగా వందే భారత్ రైళ్ల పై రాళ్లదాడి వంటి ఘటనలకు పాల్పడడంతో రైళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రకమైన సంఘ వ్యతిరేక చర్యల మూలాన సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రైళ్లు, రైల్వే స్టేషన్‌లు, ప్రజల ఆస్తుల నష్టం జరిగినట్టే.. ఎందుకంటే ఇవన్నీ ప్రజల డబ్బుతో నిర్మించి, ప్రజల కొరకు సేవలు అందిస్తున్నాయి. ఈ దాడుల మూలాన కల్గిన నష్టాన్ని తిరిగి ప్రజలే భరించవలసి ఉంటుంది . కాబట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు నష్టం కలిగించవద్దని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..