
చిన్న నెలవారీ పొదుపులతోనే పెద్ద నిధిని నిర్మించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవడం సాధ్యమని వారు సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం లేకుండా, ప్రతి నెలా కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టే సౌలభ్యం SIPలో ఉండటం వల్ల ఇది మధ్యతరగతి పెట్టుబడిదారుల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బును సేవ్ చేసి సరైన చోట పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. SIP ద్వారా పెట్టుబడి పెడితే కాంపౌండింగ్ ప్రభావం వల్ల కాలక్రమంలో పెట్టుబడి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే SIP రాబడులు మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు రాబడి రావచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇది హామీ కాదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.1000 చొప్పున SIPలో పెట్టుబడి పెట్టి, దాన్ని 20 సంవత్సరాలు కొనసాగిస్తే సుమారు రూ.9.19 లక్షల నిధి సమకూరే అవకాశం ఉంది.
ఇందులో పెట్టిన మొత్తం రూ.2.40 లక్షలు కాగా, లాభం దాదాపు రూ.6.79 లక్షలు అవుతుంది. అదే విధంగా నెలకు రూ.2000 SIPను 20 సంవత్సరాలు కొనసాగిస్తే మొత్తం నిధి సుమారు రూ.18.39 లక్షలకు చేరవచ్చు. ఈ సందర్భంలో పెట్టుబడి రూ.4.80 లక్షలు కాగా, లాభం సుమారు రూ.13.59 లక్షలు ఉంటుంది. మరోవైపు నెలకు రూ.3000 SIPను అదే కాలానికి కొనసాగిస్తే దాదాపు రూ.27.59 లక్షల నిధి ఏర్పడే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పెట్టిన మొత్తం రూ.7.20 లక్షలు కాగా, లాభం సుమారు రూ.20.39 లక్షలు కావచ్చు. మొత్తానికి చిన్న మొత్తంతో ప్రారంభించిన SIP కూడా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదగా మారే అవకాశముంది. అయితే సరైన మ్యూచువల్ ఫండ్ ఎంపిక, క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించడం, దీర్ఘకాల దృష్టితో ముందుకు సాగడం వంటి అంశాలు కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయని, పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిదని వారు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి