కాలం కన్నెర్ర జేస్తే ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత వినే వుంటారు. ఏమో ఎవరికి ఎరుక.. ఎవరి బతుకు ఏ క్షణాన ఏమౌతుందో. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితే ఎదురైతే మనం ఎలా ఉండబోతామో ముందుగా తెలుసుకునే ఛాన్స్ ఉందా? టెక్నాలజీ పుణ్యమా అని అదీ సాధ్యమేనని తేలిపోయింది. ప్రపంచ అపర కుబేరులు జెఫ్ బెజోస్ నుంచి ఎలోన్ మస్క్ వరకు అందరూ మాసిపోయిన బట్టల్లో స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్నట్లు దీనంగా కనిపిస్తోన్న ఈ ఫొటోలను చూశారా? ఇదంతా ఏంటి.. ఏం జరుగుతోంది? అని తికమక పడిపోతున్నారా? మరేంలేదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మిడ్‌జర్నీ వంటి యాప్‌ల ద్వారా పండు ముసలిని పసి పిల్లాడిలా, వీధిలో అడుక్కునే బికారి ధనవంతుడిగా మారితే ఎలా ఉంటుందో చిటికెలో క్రియేటివ్ ఇమేజ్‌లను సృష్టించగలవు. అలాంటి సృష్టే ఇది కూడా.
ఏఐ ఆర్ట్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు పేదవారైతే ఎలా ఉంటారని ఊహిస్తూ గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ ఈ ఇమేజ్‌లను రూపొందించాడు. మిడ్‌జౌనీ అనే యాప్ ద్వారా తన ఊహలకు ప్రాణం పోశాడు. డోనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ముకేష్ అంబానీ, మార్క్ జుకర్ బర్గ్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్‌ల వంటి బిలియనీర్ల ఫొటోలను గోకుల్ పిళ్లై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్స్ (ఈ జాబితాలో ఇంకెవరినైనా చేర్చడం మర్చిపోయానా?)’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఏమాటకామాట చెప్పుకోవాలి.. ఎలన్ మస్క్ మాత్రం పేద వాడి గెటప్‌లోనూ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేసుకోండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.