బంగారంపై పెట్టుబడి.. కళ్లు చెదిరే లాభాలు! SGBలపై ఏకంగా 235 శాతం రాబడి!

సోవరెన్ గోల్డ్ బాండ్స్ 2021-22 సిరీస్-I పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చాయి. ఆర్‌బీఐ ముందస్తు విమోచన ధరను యూనిట్‌కు 15,840గా నిర్ణయించడంతో, పెట్టుబడిదారులు సుమారు 235 శాతం రాబడిని పొందుతున్నారు. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా అదనపు లాభాన్ని అందిస్తోంది.

బంగారంపై పెట్టుబడి.. కళ్లు చెదిరే లాభాలు! SGBలపై ఏకంగా 235 శాతం రాబడి!
Sovereign Gold Bonds

Updated on: May 25, 2026 | 9:19 AM

బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి మరోసారి భారీ శుభవార్త అందింది. RBI తాజాగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ 2021-22 సిరీస్‌ I ముందస్తు విమోచన ధరను యూనిట్‌కు రూ.15,840గా నిర్ణయించింది. దీంతో ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారు సుమారుగా 235 శాతం వరకు ఆకర్షణీయమైన రాబడిని పొందుతున్నారు. ముఖ్యంగా ఈ లాభాల్లో బాండ్లపై లభించే 2.5 శాతం వార్షిక వడ్డీని పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం బంగారం ధరల పెరుగుదల వల్లే ఈ స్థాయి లాభాలు వచ్చాయి. ఆర్‌బిఐ వివరాల ప్రకారం.. 999 స్వచ్ఛత గల బంగారం గత మూడు ట్రేడింగ్ రోజుల సగటు ధర ఆధారంగా విమోచన ధరను నిర్ణయించారు. మే 25, 2026 నుంచి ఈ ధర అమల్లోకి వచ్చింది. జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తైన తర్వాత, నిర్ణీత వడ్డీ చెల్లింపు తేదీలలో మాత్రమే ముందస్తు విమోచన సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఈ సిరీస్‌లో ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడి పెట్టిన వారు గ్రాముకు రూ.4,727 చొప్పున బాండ్లు కొనుగోలు చేశారు. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినవారికి ధర గ్రాముకు రూ.4,777గా ఉంది. ఇప్పుడు విమోచన ధర రూ.15,840కు చేరడంతో, ఆన్‌లైన్ పెట్టుబడిదారులు ఒక్క గ్రాముపై రూ.11,113 మేర ప్రత్యక్ష లాభాన్ని పొందారు. అంటే అప్పట్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి ప్రస్తుతం సుమారు రూ.3.35 లక్షలకు పెరిగినట్లైంది. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం SGBలు ఎంత బలమైన సాధనమో మరోసారి స్పష్టమైంది. బంగారం భౌతిక రూపంలో కొనుగోలు చేయకుండా, సురక్షితంగా, అదనపు వడ్డీ ప్రయోజనంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ బాండ్లు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.

అయితే పెట్టుబడిదారులు తాజా పన్ను నిబంధనలను కూడా గమనించాలి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, గడువుకు ముందే SGBలను విక్రయిస్తే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను నేరుగా కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు పూర్తి ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ వరకు వాటిని కొనసాగిస్తే మాత్రమే పన్ను మినహాయింపు పొందగలరు. ఇక సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి, మెచ్యూరిటీ వరకు బాండ్లు ఉంచినా పన్ను మినహాయింపు వర్తించదు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us