Stock Market: దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఆర్థిక సంవత్సరం మొదట రోజు 708 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

|

Apr 01, 2022 | 4:12 PM

ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 708 పాయింట్లు పెరిగి 59, 277 వద్ద స్థిరపడింది...

Stock Market: దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఆర్థిక సంవత్సరం మొదట రోజు 708 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
stock Market
Follow us on

ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 708 పాయింట్లు పెరిగి 59, 277 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 206 పాయింట్ల్ లాభపడి 17, 670 వద్ద ముగిసింది. బ్యాంకు, పవర్ స్టాక్‌లు మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. దీనితోపాటు అంతర్జాతీయ సానుకూలతలు కూడా తోడయ్యాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 1.49 శాతం , స్మాల్‌ క్యాప్ 1.68 శాతం పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 2.13 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 1.87 శాతం పెరిగింది. కరెంటు ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ నిఫ్టీ టాప్ గెయినర్‌గా నిలించింది. ఆ స్టాక్ 5.78 శాతం పెరిగి 142.80 వద్ద స్థిరపడింది. పవర్ గ్రిడ్ కార్ప్ 3.99 శాతం పెరిగింది. బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కూడా లాభపడ్డాయి.

2,732 కంపెనీల షేర్లు పెరగ్గా 663 కంపెనీల షేర్లు తగ్గాయి. 30-షేర్ల BSE ఇండెక్స్‌లో NTPC, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, SBI, HDFC, M&M, బజాజ్ ఫైనాన్స్, విప్రో లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ నష్టాల్లో స్థిరపడ్డాయి. అలాగే, ఆదాయపు పన్ను (ఐ-టి) దాడుల ఆందోళనల మధ్య హీరో మోటోకార్ప్ 2.39 శాతం పడిపోయింది. ఎస్‌ఎంఎల్‌ ఇసుజు షేర్లు ఈరోజు 20 శాతం వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ షేర్లలో 43 శాతం వృద్ధి నమోదు కావడమే అందుకు కారణం.

టాటా మోటార్స్‌ దేశీయ విక్రయాల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 2 శాతం మేర లాభపడ్డాయి. గుజరాత్‌ ఆల్కలీస్‌ షేర్లు ఈ నెలలో 51 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్‌లో ఈ స్టాక్‌ 12 శాతం మేర లాభపడింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్ ధర తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 105 డాలర్లుగా ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 100 డాలర్లుగా ఉంది.

 

Read Also..  Adani Wilmar: లాభాలు తెచ్చిపెడుతున్న అదానీ విల్మార్.. వారంలో 30 శాతం పెరిగిన స్టాక్..