స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీల్లో పబ్లిక్ షేర్‌హోల్డర్ల వాటాను 35 శాతానికి పెంచుకునేందుకు ఆయా కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్ల గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అన్ని కంపెనీలకు నియమ నిబంధనలు, కాలపరిమితి ఒకేలా ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలను సెబీ జారీ చేయనుందన్నారు.
ప్రస్తుతం మనదేశంలో స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా పబ్లిక్ షేర్‌హోల్డర్లకు ఉండాలి. ప్రమోటర్లకు 75 శాతం వరకూ వాటా ఉండొచ్చు. ఈ నిబంధన త్వరలో మారుతుందని, ప్రమోటర్ల వాటా 65 శాతానికి పరిమితమై, పబ్లిక్ షేర్‌హోల్డర్ల చేతుల్లో 35 శాతం షేర్లు ఉండే విధంగా నిబంధనల్లో మార్పు రాబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా సంకేతాలిచ్చారు. అందుకనుగుణంగా సెబీ మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది.