ATM Charges: బ్యాంక్ ఖాతాదారులందరికీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఏటీఎం ఛార్జీలు.. కొత్త రేట్లు ఇలా..

ఎస్బీఐలో సేవింగ్స్ లేదా శాలరీ అకౌంట్ ఉందా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఈ అకౌంట్లు ఉన్నవారికి ఏటీఎం ఛార్జీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. ఈ సవరించిన రేట్లు గత ఏడాది డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి.

ATM Charges: బ్యాంక్ ఖాతాదారులందరికీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఏటీఎం ఛార్జీలు.. కొత్త రేట్లు ఇలా..
Atm Charges

Updated on: Jan 12, 2026 | 9:16 PM

దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఏటీఎం ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో జరిపే లావాదేవీలపై ఛార్జీలను సవరించింది. ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్ పూర్తైన తర్వాత నిర్వహించే ఏటీఎం ఛార్జీలను భారీగా పెంచింది. ఈ పెంచిన ఛార్జీలు గత ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. సేవింగ్స్ అకౌంట్ వాడేవారితో పాటు శాలరీ అకౌంట్ వాడేవారికి ఏటీఎం రుసుములను పెంచింది. ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్ డ్రావల్ మెషిన్ లావాదేవీల ఛార్జీలను కూడా సవరించింది. ఎంతవరకు పెంచింది..? ఇప్పటినుంచి ఎంత ఛార్జీలు పడతాయి? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.

పెంచిన ఛార్జీలు ఇవే..

గత ఏడాది ఫిబ్రవరిలో ఏటీఎం ఛార్జీలను ఎస్‌బీఐ సవరించింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న డిసెంబర్‌లో మరోసారి మార్పులు చేసింది. ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంల్లో పరిమిత సంఖ్య కంటే అధికంగా చేసే లావాదేవీల ఛార్జీలు పెరిగాయి. ఎస్‌బీఐ ఏటీఎంలో ఛార్జీలు ఎప్పటిలాగే ఉంటాయి. సొంత ఏటీఎం రుసుముల్లో ఎస్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక నుంచి ఇతర ఏటీఎంల్లో లిమిట్‌కు మించి చేసే ప్రతీ విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేస్తారు. గతంలో రూ.21 ఉండగా.. ఇప్పుడు అదనంగా రూ.2 పెంచింది. ఇక ఇతర బ్యాంకు ఏటీఎంల్లో బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి లావాదేవీలకు గతంలో రూ.10 ఉండగా.. ఇప్పుడు రూ.11కి పెంచింది.

శాలరీ అకౌంట్ ఉందా..?

ఇక ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యలో మార్పులు జరగలేదు. నెలకు ఐదు ట్రాన్సాక్షన్ల వరకు ఇతర ఏటీఎంలలో ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక శాలరీ అకౌంట్ కలిగినవారు ఎస్బీఐయేతర ఏటీఎంల్లో నెలకు 10 లావాదేవీలు ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత మాత్రమే ఛార్జీలు కట్ అవుతాయి. గతంలో శాలరీ ఖాతా కలిగినవారు ఎన్నిసార్లు అయినా ఉచితంగా వాడుకునే వెసులుబాటు ఉండగా.. ఇప్పుడు నిబంధనలు మార్చారు. ఇక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు యధావిధిగా చార్జీలు ఉంటాయి. ఇక ఎస్బీఐ, కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలకు సవరించి ఛార్జీలు వర్తించవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఛార్జీలను కస్టమర్లు అందరూ గమనించాలని ఎస్బీఐ తెలిపింది. దీనికి అనుగుణంగా ఏటీఎంలను వినియోగించాలని తెలిపింది.