Rupee fall: బీపీ వచ్చినట్లు వణికిపోతున్న రూపీ.. పతనం అవుతున్న రూపాయి విలువ

బీపీ వచ్చినట్లు రూపీ వణికిపోతోంది. రూపాయి మారకం విలువ ఆల్‌ టైమ్‌ కనిష్ట స్థాయికి చేరడంతో అలారం బెల్స్‌ మోగుతున్నాయి. రూపాయి పతనం.. ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? కామన్‌మేన్‌ జేబుకు భారీ చిల్లు పడనుందా? ఈ పతనం ఇంకా ఎంతదాకా వెళ్లే అవకాశం ఉంది.

Rupee fall: బీపీ వచ్చినట్లు వణికిపోతున్న రూపీ.. పతనం అవుతున్న రూపాయి విలువ
Indian Rupee, Dollar

Updated on: Jan 23, 2026 | 10:28 PM

మన రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 77 పైసలు క్షీణించి 91.74 దగ్గర ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 68 పైసలు నష్టపోయి 91.65 దగ్గర స్థిరపడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనంతో ఖర్చులు పెరిగి, రుణాలు మరింత ఖరీదెక్కి, దిగుమతులు భారమై… ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా రూపాయి ఈ స్థాయిలో పతనం అవడం, ఆర్థిక వర్గాల్లో అలారం బెల్స్‌ మోగిస్తోంది. రూపాయి విలువ గత 11 ఏళ్లలో 57 శాతం డౌన్‌ అయింది. ఈ ఏడాదిలో రూపాయి విలువ రూ. 1.77 మేర పతనమైందని, దీంతో ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీల్లో రెండోదిగా రూపాయి నిలిచిందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఓవైపు ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌

గ్రీన్‌ల్యాండ్ గొడవలో…సుంకాల పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలపై బెదిరింపులకు దిగడం, తమ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తువులు, సర్వీసులపై ట్రంప్‌ పెద్ద ఎత్తున సుంకాలు విధించడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల కారణంగా దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లాంటి కారణాలతో ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ అంతకంతకూ బలహీనపడుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ నిధుల నిరంతర నిష్క్రమణ, అలాగే బంగారం, వెండి లాంటి మెటల్స్ దిగుమతిదారుల నుంచి డాలర్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరగడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది.

రూపాయి పతనంతో పెను ప్రమాదం

రూపాయి విలువ అంతకంతకు పతనమైతే, అది పెను ప్రమాదం తెచ్చి పెడుతుందని, అనేక సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అలాగే దేశంలోకి దిగుమతయ్యే ప్రతి వస్తువు ధర పెరుగుతూపోతుంది. చెల్లింపులు డాలర్లలో జరగడమే దీనికి కారణమంటున్నారు. ముఖ్యంగా ముడిచమురుతో పాటు మొబైల్స్‌, కంప్యూటర్లు వంటి దిగుమతి చేసుకొనే కన్జ్యూమర్‌ గూడ్స్‌ ధరలు పెరగొచ్చని చెప్తున్నారు. అలాగే, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లి, తయారీ రంగం కుంటుబడుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా నిరుద్యోగం విజృంభించి చివరకు వృద్ధిరేటు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అన్ని ఖర్చులు పెరిగి కామన్‌మేన్‌ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. రుణాలు మరింత ఖరీదెక్కే ప్రమాదం ఉంది.

ప్రస్తుతానికి మార్కెట్లో అస్థిరతను తగ్గించేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు రూపాయిపై ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.