
నగరాలు, పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. అయితే ఇంట్లోకి వెళ్లేటప్పుడు యజమానితో ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్ చేసుకోరు. దీని వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలాంటి హామీ అనేది ఉండదు. దీంతో రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక అద్దె చెల్లింపులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రూప్స్ ఉంచుకోరు. నగదు క్యాష్ రూపంలో చెల్లిస్తే ఎలాంటి ఆధారాలు ఉండవు. దీని వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్, నెలవారీ అద్దె, అద్దె పెంపుకు సంబంధించి ముందే రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో యజమాని, అద్దెదారుడి మధ్య ఎలాంటి వివాదాలకు తావు ఉండదు. ఇంట్లోకి చేరేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
అద్దె ఒప్పందంలో ప్రధానంగా మూడు విషయాలు ఉండాలి. సెక్యూరిటీ డిపాజిట్, అద్దె ఎంత, ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వచ్చే వాపస్ వంటి పొందుపర్చాలి. మీ ఒప్పందంలో వాపసు నిబంధన లేకుండా కేవలం సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే ఉంటే.. తిరిగి వాపస్ పొందటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమంది ఇంటి యజమానులు అద్దెదారుడు వెళ్లిపోయిన బకాయి బిల్లులను కారణంగా చూపి మూడు నుండి ఆరు నెలల వరకు డిపాజిట్లను తమ వద్దే ఉంచుకుంటారు. ఇల్లు ఖాళీ చేసిన 30 రోజుల్లోగా వాపసు ఇవ్వాలనే నిబంధనలను పాటించడం లేదు. ఇక అద్దె ఒప్పందాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయకపోతే కోర్టులో చెల్లదు. రిజిస్ట్రేషన్ ఖర్చు వార్షిక అద్దెలో ఒకటి నుండి రెండు శాతం మధ్య ఉంటుంది.
సెక్యూరిటీ డిపాజిట్‌ను ఇంటి యజమాని ఇవ్వకపోతే అద్దెదారుడు ఫిర్యాదు చేయవచ్చు. మొదటిది ఒక న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించవచ్చు. చాలా మంది ఇంటి యజమానులు కోర్టుకు హాజరు కావడం కంటే డబ్బు వాపసు ఇవ్వడానికే ఇష్టపడతారు. దీంతో లీగల్ నోటీస్ ఉత్తమమైన మార్గం. ఇక మీ నగరంలోని అద్దె అథారిటీ లేదా అద్దె నియంత్రణాధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఇరవై 20 లక్షల రూపాయల లోపు డిపాజిట్ల కోసం వినియోగదారుల రక్షణ చట్టం కింద వినియోగదారుల ఫిర్యాదు చేసే అవకాశముంది. ఈ మూడు మార్గాల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల ఫోరమ్ లేదా అద్దె అధికార సంస్థ వద్దకు వెళ్ళే డిపాజిట్ వివాదం ఎవరు సరైనవారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అది ఎవరు పత్రాల ఆధారాలను భద్రపరిచారనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఇంట్లోకి చేరేముందు ఫొటోలు తీసుకోండి.