
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను పున:ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవ్వగా.. నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో పట్ణణ సహకార బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను పున:ప్రారంభించడంపై చర్చించారు. కమిటీ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం దీనికి ఆమోదముద్ర వేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.
2004లో ఆర్బీఐ పట్టణ సహకార బ్యాంకులు(యూసీబీ)కు లైసెన్స్ ఇచ్చే విధానాన్ని నిలిపివేసింది. లైసెన్స్ పొందిన అనేక UCBలు స్వల్ప కాలంలోనే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనిని గుర్తించిన ఆర్బీఐ.. UCBలకు లైసెన్సులు జారీ చేయడాన్ని 2004లో నిలిపివేసింది. ఆ తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి లైసెన్సులు జారీ చేసే విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెడుతోంది. అయితే పట్టణ సహకార బ్యాంకులకు కొత్త లైసెన్సులు జారీ చేయడం వల్ల కలిగే లాభనష్టాలను సమీక్షించాలనే నిర్ణయాన్ని అక్టోబర్ 1, 2025న ద్రవ్య విధాన ప్రకటనలో ఆర్బీఐ మొదటిసారిగా ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పుడు మార్గదర్శకాల జారీకి సిద్దమైంది. అయితే లైసెన్సులు ఇచ్చే ప్రక్రియను తిరిగి ప్రారంభించడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
2004తో పోలిస్తే ప్రస్తుతం పని వాతావరణం మారింది. నిర్వహణ వాతావరణం కూడా మారింది. అప్పటినుంచి పట్టణ సహకార బ్యాంకులకు సంబంధించి అనేక మార్పుుల చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పుడు తిరిగి లైసెన్సులు అందించాలని నిర్ణయించింది. 1966లో యూసీబీలను ఆర్బీఐ కిందకు తీసుకొచ్చారు. 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని సవరణలు చేయడం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా సహకార సంఘం రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద లేదా బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద నమోదై ఉంటే.. ఏదైనా బ్యాంకింగ్ కార్యకలాపాన్ని నిర్వహించాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 22 కింద ఆర్‌బిఐ నుండి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. దేశంలో2025 మార్చి 31 నాటికి 1457 యూసీబీలు ఉన్నాయి. 1993 నుంచి 2001 మధ్య 823 యూసీబీలకు ఆర్బీఐ లైసెన్స్ జారీ చేసింది. గతంలో యూసీబీలు ఆర్ధిక దివాళా తీస్తున్నాయనే కారణంతో లైసెన్సులను ఆపివేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు విధానాల్లో మార్పులు జరిగాయి. దీంతో ఇప్పుడు జారీ చేస్తే అలాంటి పరిస్థితి ఉండదని ఆర్బీఐ భావిస్తోంది.