RBI Directs Loan Recovery Agents: రుణ వసూలకు రికవరీ ఏజెంట్లు చేస్తున్న దారుణాలకు ఆర్‌బీఐ కళ్లెం వేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలను శుక్రవారం (ఆగస్టు 12) విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటలలోపే రుణ గ్రహీతలకు రుణ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేయాలని స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ సంస్థలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఐతే సూక్ష్మ రుణాలకు ఈ సర్క్యులర్ వర్తించదని ఆర్బీఐ తెల్పింది. తమ రుణ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించేలా చూడాలని ఆర్‌బీఐ హెచ్చరించింది. ఎప్పుడుపడితే అప్పడు ఏజెంట్లు వేధిస్తున్నారని ఫిర్యాదులు చేరిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మాటల ద్వారాగానీ, చేతల ద్వారాగానీ రుణగ్రహీతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించకూడదు. రుణగ్రహీతల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదు. రుణ గ్రహీతల కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు సంబంధించిన మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లను పంపించకూడదు. వారిని భయభ్రాంతులకు గురిచెయ్యాకూడదని ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.