
కొంతమంది ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వందే భారత్ రైళ్లు వచ్చిన కొత్తలో అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల, అరెస్ట్ అయిన వారి సంఖ్యను రైల్వే శాఖ వెల్లడించింది.
రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనల్లో ఇప్పటి వరకు 1698 కేసులు నమోదు చేసినట్లు వాటిలో 665 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వివిధ రైల్వే జోన్లలో రైళ్లపై రాళ్లు రువ్వే సంఘటనలను భారత రైల్వే నిశితంగా పరిశీలిస్తోందని, ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భద్రతకు హాని కలిగించడమే కాకుండా విలువైన ప్రజా ఆస్తులకు కూడా నష్టం కలిగిస్తాయని అన్నారు.
జూలై నుండి డిసెంబర్ 2025 వరకు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం 1,698 రాళ్లు రువ్వే కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఉన్న 665 మంది అరెస్టు అయ్యారు. ఉత్తర రైల్వే అత్యధికంగా (363) కేసులను నమోదు చేయగా, తరువాత తూర్పు మధ్య రైల్వే (219), దక్షిణ మధ్య రైల్వే (140), ఉత్తర మధ్య రైల్వే (126), పశ్చిమ రైల్వే (116) మరియు దక్షిణ రైల్వే (108) ఉన్నాయి. సెంట్రల్ రైల్వే (96), తూర్పు రైల్వే (71), నార్త్ ఫ్రాంటియర్ రైల్వే (67), సౌత్ వెస్ట్రన్ రైల్వే (80), వెస్ట్ సెంట్రల్ రైల్వే (77), ఈస్ట్ కోస్ట్ రైల్వే (50), సౌత్ ఈస్టర్న్ రైల్వే (51), సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే (51), నార్త్ వెస్ట్రన్ రైల్వే (55), నార్త్ ఈస్టర్న్ రైల్వే (25) మరియు కొంకణ్ రైల్వే (3) వంటి ఇతర జోన్లలో కూడా సంఘటనలు నమోదయ్యాయి.
ప్రయాణీకుల భద్రతలో రాజీ పడేది లేదని, రైల్వే ఆస్తికి నష్టం కలిగించే కార్యకలాపాల పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామంటూ ఆకతాయిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రైల్వే అధికారులు. భారతీయ రైల్వేలు నిఘా చర్యలను ముమ్మరం చేశాయి. దుర్బలమైన విభాగాలలో పెట్రోలింగ్‌ను పెంచాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా నేరస్థులను త్వరగా గుర్తించడం, అరెస్టు చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి